బ్యాటింగ్‌ చేయడం మర్చిపోతానా..!

25 Dec, 2019 01:06 IST|Sakshi

గతమేదో గడిచింది... ఇకపై తాజాగా బరిలోకి

స్థానం కోసం పోటీ తప్పదు

ఆటలో సవాళ్లు, విమర్శలు సహజం

శిఖర్‌ ధావన్‌ మనోగతం

న్యూఢిల్లీ: ఈ ఏడాది గాయాలతో సతమతమైన భారత ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ కొత్త ఏడాదిని సరికొత్తగా ప్రారంభిస్తానని చెప్పాడు. తన శైలి శాశ్వతమని, బ్యాటింగ్‌ చేయడం మర్చిపోలేదన్నాడు. ఈ ఏడాదంతా గాయాలు ‘గబ్బర్‌’ను తెగ ఇబ్బంది పెట్టాయి. మొదట చేతి వేలు, తర్వాత మెడ, అటుపై కన్ను, ఇటీవల మోకాలి గాయాలతో ధావన్‌ ఆటకు దూరం కావాల్సి వచ్చింది. నవంబర్‌ 21న సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ టి20 మ్యాచ్‌ తర్వాత మళ్లీ అతను బ్యాట్‌ పట్టలేదు. ఈ సమయంలో జట్టులోకి వచ్చిన లోకేశ్‌ రాహుల్‌ ఓపెనర్‌గా సూపర్‌ హిట్టయ్యాడు.

ఇప్పుడు మోకాలి గాయం నుంచి పూర్తిగా కోలుకోవడంతో ధావన్‌ స్వదేశంలో శ్రీలంక, ఆస్ట్రేలియాలతో జరిగే సిరీస్‌లకు ఎంపికయ్యాడు. దీనిపై మంగళవారం ప్రాక్టీస్‌ సెషన్‌ ముగిశాక మీడియాతో ధావన్‌ మాట్లాడుతూ ‘ఇది నాకు తాజా ఆరంభం. ఈ యేడు చేతి వేలి నుంచి మోకాలి గాయం దాకా చాలా ఇబ్బంది పడ్డాను. ఈ కష్టకాలంలో శుభవార్త ఏంటంటే కొత్త సంవత్సరం రావడం. రాహుల్‌ బాగా ఆడటం నన్ను సంతోషపరిచింది. అంది వచి్చన అవకాశాల్ని చక్కగా సది్వనియోగం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు నేను సత్తా చాటాలి’ అని అన్నాడు.  

గాయాలు తప్పవు
గాయాలనేవి మన నియంత్రణలో ఉండవని... అయితే ఎదురుదెబ్బలెన్ని ఎదురైనా ఎప్పుడు ప్రభావితం కాలేదని, ఇది తన అదృష్టమని చెప్పుకొచ్చాడు. ‘ఆటగాళ్లకు గాయాలు సహజం. వీటిని అంగీకరించాల్సిందే. అంతేతప్ప ఎక్కువగా ఆలోచించను. బాగా ఆడుతున్నపుడే ఇలా గాయాలతో ఆగిపోవడం కష్టమనిపించలేదు. ఎందుకంటే నేనేమీ బ్యాటింగ్‌ చేయడం మర్చిపోలేదు. నా శైలి నాకుంది. పరుగులు చేసే సత్తా నాలో ఉంది’ అని గబ్బర్‌గా పిలుచుకునే శిఖర్‌ అన్నాడు. శ్రీలంకతో జరగనున్న టి20లకు సీనియర్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మకు విశ్రాంతి ఇవ్వడంతో ఆ సిరీస్‌ తనకు చాలా కీలకమైందని చెప్పాడు. ‘నాకిది ముఖ్యమైన సీజన్‌. లంకతో పొట్టి మ్యాచ్‌ల్లో బాగా రాణించాలి. అయితే ఆ్రస్టేలియాతో వన్డేలకు రాహుల్‌తో పాటు నేను రోహిత్‌ కూడా అందుబాటులో ఉంటాం. కాబట్టి టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు తుది జట్టు ఎంపిక సవాలే కానుంది. వాళ్ల పని వాళ్లు చేస్తారు. భారీ స్కోర్లతో నా పని నేను చేసుకుపోవాలి’ అని అన్నాడు.  

టెస్టులూ ఆడగలను
గతేడాది ఇంగ్లండ్‌తో టెస్టు ఆడాక ధావన్‌ మళ్లీ సంప్రదాయ క్రికెట్‌ ఆడలేకపోయాడు. రోహిత్‌తో పాటు మయాంక్‌ అగర్వాల్‌ వచి్చరాగానే రాణించడంతో ధావన్‌కు చోటులేకుండా పోయింది. యువ ఓపెనర్‌ పృథ్వీ షా కూడా సెలక్షన్‌కు అందుబాటులో ఉండటం ధావన్‌ ఎంపికకు సంకటంగా మారింది. అయితే బంగ్లాదేశ్‌తో సొంతగడ్డపై గత నెలలో జరిగిన టి20ల్లో శిఖర్‌ ఆడాడు. టెస్టు జట్టుకు దూరమైనంత మాత్రాన తన పని అయిపోలేదన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో పరుగులు సాధించే సత్తా తనలో ఉందన్నాడు.

‘స్టార్‌’ననే భావన లేనేలేదు
రంజీల ద్వారా మళ్లీ ఆటకు సిద్ధమవడం ఆనందంగా ఉందని ఈ ఢిల్లీ ఓపెనర్‌ చెప్పాడు. ‘రంజీల నుంచే నేనీ స్థాయికి చేరుకున్నా. ఇప్పుడు అంతర్జాతీయ స్టార్‌ననే అహం లేదు. ఎవరితోనైనా కలిసిపోతాను. నా అనుభవాన్ని కుర్రాళ్లకు పంచేందుకు ఎపుడైనా సిద్ధమే. టెస్టు జట్టులోకి రావడం కష్టమే! అయినా... నా లక్ష్యం మాత్రం మూడు ఫార్మాట్లు ఆడటం. దీనికోసం నేను ఎంతైనా శ్రమిస్తాను. ఆటగాళ్ల కెరీర్‌లో గాయాలు... ఆ తర్వాత కోలుకోవడం, తిరిగి ఫిట్‌నెస్‌ టెస్టు పాసయ్యాక పునరాగమనం ఎప్పుడైన సవాళ్లతో కూడుకున్నదే.

నా కుటుంబం ఇక ఇండియాలోనే..
మొత్తానికి తన భార్య, పిల్లలు భారత్‌లోనే స్థిరపడేందుకు వస్తున్నారని ధావన్‌ ఎంతో సంతోషంగా చెప్పాడు. ‘ఆ్రస్టేలియాలో ఉండే నా భార్య ఆయేషా, కుమారుడు జొరావర్‌ ఇప్పుడు పూర్తిగా స్వదేశానికొస్తున్నారు. దీంతో నా వెంట నా కుటుంబం ఎప్పుడూ ఉంటుంది’ అని ధావన్‌ అన్నాడు. విమర్శలకు అతిగా స్పందించనని, వాళ్ల అభిప్రాయం వారిదని తన ఆట ఏంటో తనకు తెలుసు కాబట్టి వారిని పెద్దగా పట్టించుకోనని చెప్పాడు.

నేటినుంచి రంజీ ట్రోఫీలో...
హైదరాబాద్‌తో బుధవారం నుంచి మొదలయ్యే రంజీ మ్యాచ్‌లో అతను ఢిల్లీ సారథిగా బరిలోకి దిగనున్నాడు. ఫిట్‌నెస్‌ నిరూపించుకునేందుకు తన సొంత జట్టు తరఫున ఆడేందుకు సిద్ధమయ్యాడు. నేటి నుంచి నాలుగు రోజుల మ్యాచ్‌ ఫిరోజ్‌షా కోట్లా స్టేడియంలో జరుగుతుంది. అతనితో పాటు ఢిల్లీ జట్టులో సీనియర్‌ పేసర్‌ ఇషాంత్‌ శర్మ కూడా ఆడతాడు.  

మరిన్ని వార్తలు