మురికివాడ నుంచి మ్యూనిక్ క్లబ్‌కు...

24 Aug, 2016 00:25 IST|Sakshi
మురికివాడ నుంచి మ్యూనిక్ క్లబ్‌కు...

11 ఏళ్ల ఒడిశా కుర్రాడికి అరుదైన అవకాశం
భువనేశ్వర్: ఒడిశా మురికివాడలోని పదకొండేళ్ల కుర్రాడికి... జర్మనీలోని ప్రముఖ ఫుట్‌బాల్ క్లబ్‌లో శిక్షణ పొందే అవకాశం వచ్చింది. భువనేశ్వర్‌లోని సబర్ షాహీ మురికివాడలో ఉండే చందన్ నాయక్... జర్మన్ జాతీయ చాంపియన్స్ బాయెర్న్ మ్యూనిక్‌లో రెండు నెలలపాటు శిక్షణ పొందనున్నాడు. పేదరికంతో తినేందుకు తిండిలేకపోయినా... భారత్‌కు ఫుట్‌బాల్ ఆడాలన్న కలను సాకారం చేసేందుకు  చందన్ తీవ్రంగా శ్రమించాడని అతని కోచ్ మహాపాత్ర తెలిపారు.

సాధారణంగా ప్రపంచ వ్యాప్తంగా 14 నుంచి 16 ఏళ్లలోపు వారిని పరీక్షించి ఈ శిక్షణ కార్యక్రమానికి ఎంపిక చేస్తారు. కానీ కోచ్ కోరిక మేరకు ఒకసారి పదకొండేళ్ల చందన్‌కు పరీక్ష పెట్టారు. ఈ చిన్నోడి చురుకుదనానికి ఆశ్చర్యపోయిన నిర్వాహకులు.. శిక్షణలో పాల్గొనే అవకాశం ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా 200 మందికి రానుపోనూ ఖర్చులతోపాటు.. అన్ని వసతులు కల్పించి.. ప్రపంచ స్థాయి కోచ్‌లతో ఈ క్లబ్‌లో శిక్షణ ఇస్తారని మహాపాత్ర తెలిపారు. చందన్ తండ్రి చిన్నప్పుడే కుటుంబాన్ని వదిలి వెళ్లినా... ఆమె తల్లి నాలుగిళ్లలో పనిమనిషిగా చేసి పిల్లలను ఉన్నత స్థానంలో చూసేందుకు చాలా కష్టపడిందన్నారు.

మరిన్ని వార్తలు