నేటి నుంచి ‘పింక్’ షో

18 Jun, 2016 00:17 IST|Sakshi

 గులాబీ బంతితో భారత్‌లో తొలి డే అండ్ నైట్ మ్యాచ్

కోల్‌కతా: దేశంలో తొలిసారిగా గులాబీ బంతితో క్రికెట్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) ఆధ్వర్యంలో నేటి (శనివారం) నుంచి నాలుగు రోజుల పాటు ఈడెన్‌గార్డెన్స్‌లో జరిగే సూపర్ లీగ్ ఫైనల్ మ్యాచ్‌కు గులాబీ బంతి వాడబోతున్నారు. మోహన్ బగాన్, భవానీపూర్ క్లబ్‌ల మధ్య మధ్యాహ్నం 2.30 గంటల నుంచి జరిగే ఈ మ్యాచ్‌ను స్టార్ స్పోర్ట్స్-2లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. అక్టోబర్‌లో న్యూజిలాండ్‌తో ఓ టెస్టును డే అండ్ నైట్ మ్యాచ్‌గా జరపాలని బీసీసీఐ ఆలోచిస్తోంది. అయితే దీనికి ఉపఖండ పరిస్థితులు ఎంత మేరకు అనుకూలిస్తాయనే సందేహాలు నెలకొన్నాయి.

ఈనేపథ్యంలో క్యాబ్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ముందుకు వచ్చి ఈ మ్యాచ్‌ను డే అండ్ నైట్‌లో జరపాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే కివీస్‌తో మ్యాచ్ కూడా ఈడెన్‌లో జరిపే అవకాశాలున్నాయి. మరోవైపు రెండు రోజుల్లో రుతుపవనాలు బెంగాల్‌లో ప్రవేశించనుండడంతో వర్షం ఆటంకంగా మారే అవకాశాలున్నాయి. భారత క్రికెటర్లు  షమీ, సాహా ఈ మ్యాచ్‌లో మోహన్ బగాన్ జట్టు తరఫున బరిలోకి దిగబోతున్నారు. ఏడేళ్ల క్రితం ఆసీస్‌లో జరిగిన ఎమర్జింగ్ సిరీస్‌లో సాహా పింక్ బంతితో క్రికెట్ ఆడాడు.

మరిన్ని వార్తలు