నేటి నుంచి ముక్కోణపు సిరీస్

5 Aug, 2015 00:59 IST|Sakshi

♦ బరిలో భారత్ ‘ఎ’ జట్టు
♦ శుక్రవారం తొలి మ్యాచ్
 
  చెన్నై: సీనియర్ జట్లలో చోటు కోసం ఎదురుచూస్తున్న క్రికెటర్లకు ఓ మంచి అవకాశం లభించింది. నేటి (బుధవారం) నుంచి భారత్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్ల మధ్య ముక్కోణపు సిరీస్ జరగనుంది. నేడు చెపాక్ స్టేడియంలో జరిగే తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా తలపడుతుంది. భారత్ తన తొలి మ్యాచ్ శుక్రవారం ఆడుతుంది. అవకాశం వచ్చిన ప్రతిసారి ఏదో రకంగా విఫలమైన టీమిండియా కుర్రాళ్లకు ఈ టోర్నీ చక్కని అవకాశం కానుంది. ముఖ్యంగా ఢిల్లీ ప్లేయర్ ఉన్ముక్త్ చంద్‌కు ఈ సిరీస్ కఠిన పరీక్షగా నిలవనుంది.

కెప్టెన్సీతో పాటు జట్టు బ్యాటింగ్ భారం కూడా తనపైనే ఆధారపడి ఉండటంతో ఈ సిరీస్‌లో ఎలాగైనా రాణించాలని పట్టుదలగా ఉన్నాడు. అలాగే భవిష్యత్ భారత్ జట్టును నిర్మించేందుకు సెలక్షన్ కమిటీ కూడా ఈ సిరీస్‌పై ఎక్కువగా దృష్టిసారించింది. రాబోయే రెండేళ్లు టీమిండియాకు బిజీ షెడ్యూల్ ఉంది. కాబట్టి ముక్కోణపు సిరీస్‌లో ఆకట్టుకుంటే సీనియర్ జట్టులో చోటు దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ టోర్నీ మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్ ప్రసారం చేస్తుంది.

మరిన్ని వార్తలు