మళ్లీ ‘తమాషా’ మొదలు!

11 Mar, 2016 00:43 IST|Sakshi

భద్రతపై రాతపూర్వక హామీ కోరుతున్న పాక్ ప్రభుత్వం జట్టు రాక మరింత ఆలస్యం
 
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: అసలు ఆడలేమన్నారు... గట్టి భద్రత కల్పిస్తామంటూ భారత ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఫలానా చోట ఆడలేమని, వేదిక మార్చమన్నారు... దానికీ సరేనంటూ వారి విజ్ఞప్తిని ఐసీసీ అంగీకరించింది. ప్రపంచకప్‌లో పాక్ పాల్గొనేందుకు అన్ని రకాలుగా సహకరిస్తున్నా, ఇప్పుడు ఆ దేశం మరో కొత్త పాట అందుకుంది. భద్రత గురించి భారత్ రాత పూర్వక హామీ ఇవ్వాలట! అప్పుడే తాము దేశంలో అడుగు పెడతామని, అప్పటి దాకా ఆటగాళ్లు పాకిస్తాన్‌నుంచి కదలరని ఆ దేశ ప్రభుత్వం చెప్పేసింది. ‘ఇప్పుడే జట్టును పంపే పరిస్థితిలో మేం లేము. పాకిస్తాన్‌కు కొన్ని భయాలు ఉన్నాయి. 

ఆటగాళ్లు అక్కడ ఆడుతున్నప్పుడు ఎలాంటి ఇబ్బందీ ఎదుర్కోకూడదనే మా ఉద్దేశం. భారత ప్రభుత్వంనుంచి రాతపూర్వక హామీ వచ్చే వరకు మా జట్టు భారత్‌కు బయల్దేరదు’ అని పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి నిసార్ అలీ ఖాన్ చౌదరి అన్నారు. బెదిరింపుల మధ్య క్రికెట్ ఎలా ఆడగలమని, లక్ష మంది సామర్థ్యం గల ఈడెన్‌గార్డెన్స్‌లోకి ఎవరైనా అవాంఛిత వ్యక్తులు వస్తే ఏం చేయగలరని ఆయన ప్రశ్నించారు.

అయితే ఈ వాదనను భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికారి వికాస్ స్వరూప్ కొట్టి పారేశారు. ‘ఒక అంతర్జాతీయ ఈవెంట్‌కు ఎలాంటి భద్రత అవసరమో అలాంటి అన్ని ఏర్పాట్లూ చేశాం. ఇటీవల పాక్ కూడా పాల్గొన్న ‘శాఫ్’ క్రీడలు ఎంత బాగా జరిగాయో అందరికీ తెలుసు. వరల్డ్ కప్‌నూ అలాగే సమర్థంగా నిర్వహిస్తాం’ అని ఆయన స్పష్టం చేశారు. జట్టు ఎప్పుడు బయల్దేరాలో స్పష్టత వచ్చే వరకు పాకిస్తాన్ జట్టు సభ్యులు లాహోర్‌లోని జాతీయ క్రికెట్ అకాడమీలోనే ఉంటారని పీసీబీ ప్రకటించింది.
 

మరిన్ని వార్తలు