అద్భుతంపై నా గురి: గగన్‌

29 Aug, 2019 06:19 IST|Sakshi

ఐదోసారి ఒలింపిక్స్‌కు అర్హత సాధించేందుకు సన్నాహాలు షురూ  

న్యూఢిల్లీ: వరుసగా ఐదోసారి ఒలింపిక్స్‌ బరిలో నిలువాలనుకుంటున్నట్లు వెటరన్‌ షూటర్‌ గగన్‌ నారంగ్‌ చెప్పారు. టోక్యో కోసం సన్నాహాలు ప్రారంభించిన తను ‘అద్భుతం’పై గురిపెట్టినట్లు చెప్పాడు. ‘నేను ఇటీవలే ప్రాక్టీస్‌ మొదలుపెట్టాను. టోక్యో వెళ్లేది లేనిది త్వరలో ప్రారంభమయ్యే పోటీలే చెబుతాయి. వచ్చే నెలలో మాకు సెలక్షన్‌ ట్రయల్స్‌ ఉన్నాయి. అక్కడ అద్భుతం జరిగితే ఆసియా చాంపియన్‌షిప్‌కు ఎంపికవుతా. అక్కడ్నుంచి ఒలింపిక్స్‌ దాకా మరెంతో దూరం ప్రయాణించాల్సి వుంటుంది’ అని లండన్‌ ఒలింపిక్స్‌ కాంస్య విజేత నారంగ్‌ అన్నాడు. వరుసగా నాలుగు ఒలింపిక్స్‌లలో పాల్గొన్న ఈ తెలంగాణ సీనియర్‌ షూటర్‌  ‘గగన్‌ నారంగ్‌ స్పోర్ట్స్‌ ప్రమోషన్‌ ఫౌండేషన్‌’ ద్వారా యువ షూటర్లకు శిక్షణ ఇస్తున్నాడు. గత కొన్నేళ్లుగా పలు నగరాల్లో షూటింగ్‌ కేంద్రాలను నెలకొల్పారు. ఎట్టకేలకు నారంగ్‌ సేవల్ని గుర్తించిన భారత ప్రభుత్వం  ‘రాష్ట్రీయ ఖేల్‌ ప్రోత్సాహన్‌ పురస్కార్‌’ అవార్డుకు ఎంపిక చేసింది. 2022 కామన్వెల్త్‌ గేమ్స్‌లో షూటింగ్‌ను తొలగించడంతో బాయ్‌కాట్‌ ప్రతిపాదనను నారంగ్‌ తప్పుబట్టారు. అది సరైన నిర్ణయం కాదన్నాడు. కోచ్‌లకు ఇచ్చే ద్రోణాచార్య అవార్డును ప్రతి దశలోని కోచ్‌లకు ఇవ్వాలన్నాడు.
 

మరిన్ని వార్తలు