రాయుడి రిటైర్‌మెంట్‌; గంభీర్‌ ఫైర్‌

3 Jul, 2019 18:36 IST|Sakshi

ముంబై: మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ అంబటి రాయుడు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పడానికి సెలక్టర్లే కారణమని టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ విమర్శించాడు. ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ వైఖరి వల్లే రాయుడు హఠాత్తుగా రిటైర్‌మెంట్‌ ప్రకటించాడని మండిపడ్డాడు. ప్రపంచకప్‌కు ఎంపిక చేయకపోవడంతో కలత చెంది రాయుడు ఈ నిర్ణయం తీసుకున్నాడని పేర్కొన్నాడు. సెలక్షన్‌ కమిటీలోని ఐదుగురు సభ్యులు కలిసి చేసిన పరుగులు కలిపినా రాయుడు తన కెరీర్‌లో సాధించిన స్కోరు కంటే తక్కువేనని ఎద్దేవా చేశాడు.

‘ఈ ప్రపంచకప్‌లో సెలక్టర్లు నన్ను తీవ్ర అసంతృప్తి​కి గురిచేశారు. వారి కారణంగానే రాయుడు రిటైర్‌మెంట్‌ నిర్ణయం తీసుకున్నాడు. అతడి నిర్ణయం నాకు బాధ కలిగించింది. గాయాల కారణంగా జట్టు దూరమైన ఆటగాళ్ల స్థానంలో రిషబ్‌ పంత్‌, మయాంక్‌ అగర్వాల్‌ను ఎంపిక చేశారు కానీ రాయుడికి మాత్రం చోటు కల్పించలేకపోయారు. ఇటీవల జరిగిన ఐపీఎల్‌లో రాయుడు బాగా ఆడాడు. దేశం కోసం చిత్తశుద్ధితో ఆడిన ఆటగాడు ఈవిధంగా రిటైర్‌ కావడం భారత క్రికెట్‌కు మంచిది కాద’ని గంభీర్‌ అన్నాడు. (చదవండి: ఆటకు రాయుడు గుడ్‌బై)

>
మరిన్ని వార్తలు