సైనీని వద్దన్నారు.. ఇప్పడేమంటారు బాస్‌!

4 Aug, 2019 12:43 IST|Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా యువ పేసర్‌ నవదీప్‌ సైనీ ప్రదర్శనతో ఢిల్లీ, డిస్ట్రిక్ట్‌ క్రికెట్‌ అసోసియేషన్‌(డీడీసీఏ) సభ్యులు బిషెన్‌ సింగ్‌ బేడీ, చేతన్‌ చౌహాన్‌ల వికెట్లు పడ్డాయని మాజీ ఓపెనర్‌, భాజపా ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ పేర్కొన్నారు. శనివారం రాత్రి వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో కోహ్లి సేన నాలుగు వికెట్లతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన సైనీ 17 పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు సాధించాడు. అయిదో ఓవర్లో బంతి అందుకొని వరుస బంతుల్లో పూరన్‌ (20), హెట్‌మయర్‌ (0)లను ఔట్‌ చేయగా ఆఖరి ఓవర్‌లో పొలార్డ్‌ (49)ని ఎల్బీగా పెవిలియన్‌ చేర్చాడు. ఈ సందర్భంగా అతడి సలహాదారు గౌతమ్‌ గంభీర్‌ ట్విటర్‌ వేదికగా సైనీని మెచ్చుకోవడంతో పాటు డీడీసీఎ సభ్యులను తీవ్రంగా విమర్శించారు.

‘సైనీ నువ్వు బౌలింగ్‌ చేయకముందే బిషన్ బేడీ, చేతన్‌ చౌహన్‌ల వికెట్లు తీశావు. నీ అరంగేట్రం మ్యాచ్‌ చూసి వారిద్దరి మిడిల్‌ స్టంప్స్‌ ఎగిరిపడ్డాయి’ అని పేర్కొన్నారు. ఢిల్లీ క్రికెటరైన నవదీప్‌ సైనీని గతంలో దిల్లీ రంజీ జట్టు తరఫున ఆడించాలని గంభీర్ ప్రతిపాదించాడు. అయితే సైనీ క్రికెట్‌కు పనికిరాడని పేర్కొంటూ వీరు బీసీసీఐకి నివేదించారు. అయినప్పటికీ గంభీర్‌ పట్టు వదలకుండా ఢిల్లీ పేసర్‌కు అండగా నిలిచి వెలుగులోకి తీసుకొచ్చాడు. ఆపై సైనీ ఐపీఎల్‌లో రాణించడంతోపాటు దేశవాళీ క్రికెట్‌లోనూ సత్తా చాటాడు. అలాగే ఇటీవల వెస్టిండీస్‌ ఎ జట్టుతో జరిగిన అనధికార వన్డే సిరీస్‌లోనూ రాణించాడు. తాజాగా విండీస్‌తో మ్యాచ్‌లో అద్వితీయ ప్రదర్శనతో ఆకట్టుకన్నాడు. సైనీ రాణించడంతో విండీస్‌ 95 పరుగులు మాత్రమే చేయగల్గింది. ఆపై లక్ష్య ఛేదనలో భారత్‌ 17.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.( ఇక్కడ చదవండి: శభాష్‌ సైనీ..)

మరిన్ని వార్తలు