గేమ్...సెట్... మ్యాచ్ ‘ఫిక్స్’!

19 Jan, 2016 03:25 IST|Sakshi
గేమ్...సెట్... మ్యాచ్ ‘ఫిక్స్’!

టెన్నిస్‌లో ఫిక్సింగ్ కలకలం
స్టార్ ఆటగాళ్లూ ‘భాగస్వాములే’
సంచలనం రేపుతున్న కథనం

 మెల్‌బోర్న్: సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌కి అంతా సిద్ధమైన వేళ టెన్నిస్ ప్రపంచాన్ని నివ్వెరపరిచే కొత్త అంశాలు బయటికి వచ్చాయి. టెన్నిస్‌లో యథేచ్ఛగా మ్యాచ్ ఫిక్సింగ్ కొనసాగుతోందని, దీనికి స్టార్ ఆటగాళ్లు కూడా మినహాయింపు కాదని ప్రఖ్యాత మీడియా సంస్థ బీబీసీ తమ పరిశోధన అనంతరం వెల్లడించింది. ఫిక్సింగ్‌కు సంబంధించి ఫైల్స్ రూపంలో రుజువులు కూడా బయటపడ్డట్లు సమాచారం.  టాప్-50 ర్యాంకుల్లో ఉన్న 16 మంది స్టార్ ఆటగాళ్లు గత పదేళ్లలో తరచుగా ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని, వీరిలో ఎనిమిది మంది ఈ సారి ఆస్ట్రేలియన్ ఓపెన్ కూడా ఆడుతున్నారని ప్రకటించడం సంచలనం రేపింది. 

గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన ఆటగాళ్లకు కూడా ఫిక్సింగ్‌లో భాగం ఉందని చెప్పడం ఒక్కసారిగా టెన్నిస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఫలానా ఆటగాళ్లపై అనుమానం ఉన్నట్లు ఏటీపీకి సమాచారం ఉన్నా... వారు ఈ 16 మందిలో కనీసం ఒక్కరిని కూడా హెచ్చరించలేదనేది కూడా ఈ వివాదంలో మరో అంశం. అవినీతి వ్యతిరేక విభాగమైన టెన్నిస్ ఇంటెగ్రిటీ యూనిట్ (టీఐయూ) చేతకానితనంగా కూడా దీనిని విమర్శకులు అభివర్ణిస్తున్నారు. దీనిపై స్పందిస్తూ ‘ఇన్నేళ్ళలో ఏ కారణంగా కూడా ఫిక్సర్లను తప్పించే ప్రయత్నం చేయలేదు. బీబీసీ చెప్పిన అంశాలు గత పదేళ్లకు సంబంధించినవి. కొత్తగా ఏదైనా వస్తే అప్పుడు విచారిస్తాం’ అని ఏటీపీ హెచ్ క్రిస్ కెర్మోడ్ స్పష్టం చేశారు.

 బీబీసీ బయటపెట్టిన వివరాలు
26 వేల టెన్నిస్ మ్యాచ్‌లను విశ్లేషించిన అనంతరం అంతర్గత సమాచారాన్ని బట్టి ఈ దర్యాప్తు సాగింది.  16 మంది స్టార్ ఆటగాళ్లు తరచుగా తాము సునాయాసంగా గెలుస్తారనుకున్న మ్యాచ్‌లను చేతులారా ఓడి బెట్టింగ్‌రాయుళ్లకు సహకరించారు. వేయి మ్యాచ్‌లకు ఒకసారి కూడా సాధ్యం కాని ఫలితంపై కూడా బుకీలు పందాలు కాసి భారీ సొమ్ము గెలుచుకోవడం విశేషం.  ఈ జాబితాలో ఒక యూఎస్ ఓపెన్ విజేత, వింబుల్డన్ డబుల్స్ విజేత కూడా ఉన్నారు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడుతున్న ఒక ఆటగాడు తన తొలి సెట్‌ను ఫిక్స్ చేయడం అలవాటుగా మార్చుకున్నాడు.  

హోటల్ రూమ్‌ల వద్ద ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకునే బుకీలు...కనీసం 50 వేల డాలర్ల ఎరతో ఫిక్సింగ్‌ను ప్రారంభిస్తున్నారు.  ఫిక్సర్లుగా బయటపడ్డవారి వద్ద 70కి పైగా ఆటగాళ్ల పేర్లు ఉన్నాయి.   రష్యా, ఇటలీ కేంద్రాలుగా ఫిక్సింగ్ గ్యాంబ్లర్లు ఎక్కువగా ఉన్నారు. ఇన్నేళ్లలో వీరు వేల కోట్లు సంపాదించినట్లు తెలుస్తోంది.
 
 2007లో రష్యాలో జరిగిన ఒక టోర్నీలో తొలి రౌండ్ మ్యాచ్ ఓడితే లక్షా 10 వేల పౌండ్లు ఇస్తామని ఆశజూపారు. నా సహాయక సిబ్బందిలో ఒక వ్యక్తి ద్వారానే నన్ను లాగే ప్రయత్నం చేశారు. అయితే దానిని నిర్ద్వంద్వంగా తిరస్కరించా. నేను ఆ టోర్నీ కూడా ఆడలేదు. ఆ ఘటన నన్ను ఒక రకంగా భయపెట్టింది. అలాంటి విషయాలకు దూరంగా ఉండాలని గట్టిగా నిర్ణయించుకున్నా. ఇలాంటి నేరాన్ని నేను సమర్థించను.      
                                     -జొకోవిచ్, ప్రపంచ నంబర్‌వన్
 
 సదరు ఆటగాళ్ల పేర్లు బయటికి రావాలని నేనూ కోరుకుంటున్నా. అతడు సింగిల్స్ ఆటగాడా, డబుల్స్ ఆటగాడా, ఏ గ్రాండ్‌స్లామ్ గెలిచాడు నేనూ తెలుసుకోవాలనుకుంటున్నా. అప్పుడైనా వాస్తవం ఏమిటో అందరికీ తెలుస్తుంది. దానిపైనే మనం చర్చ కొనసాగించవచ్చు. వెంటనే పరిష్కరించాల్సిన సమస్య ఇది.
                                                                        -ఫెడరర్
 
 నాకు ఫిక్సింగ్ గురించి అసలేం తెలీదు. నేను ఆడుతున్నప్పుడు తీవ్రంగా శ్రమిస్తాను. గెలుపుపైనే దృష్టి పెడతా. ఎప్పుడైనా నా ప్రత్యర్థులు కూడా అదే తరహాలో ఆడారనే భావిస్తున్నా.
                                                                  -సెరెనా విలియమ్స్
 

మరిన్ని వార్తలు