మీడియా ప్రశ్నలకు గంగూలీ ఆసక్తికర జవాబులు..

24 Jan, 2020 13:57 IST|Sakshi

న్యూఢిల్లీ: బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికై ముడు నెలలు పూర్తి చేసుకున్న సందర్భంగా గంగూలీ అండ్‌ టీం మీడియాతో సరదాగా ముచ్చటించారు.  బీసీసీఐలో టీమిండియా దిగ్గజ క్రికెటర్లు సచిన్‌ టెండూల్కర్‌, రాహుల్‌ ద్రవిడ్‌, అనిల్‌ కుంబ్లేల పాత్ర గురించి అడగగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ ఆసక్తికర సమాధానమిచ్చాడు. ఈ సందర్భంగా సచిన్‌ టెండూల్కర్‌, అనిల్‌ కుంబ్లే, రాహుల్‌ ద్రవిడ్‌ గురించి ఓ రిపోర్టర్‌ సౌరవ్‌ను ప్రశ్నించగా కేవలం ఆ ముగ్గురితోనే కాకుండా కాకుండా జైషా(బీసీసీఐ సెక్రటరీ), అరుణ్‌ దుమాల్‌(బీసీసీఐ కోశాధికారి), జయేష్‌ గెరోజ్‌(బీసీసీఐ జాయింట్‌ సెక్రెటరీ)లతో సమన్వయ పరుచుకుంటూ క్రికెట్‌ అభివృద్ధికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

గత మూడేళ్లుగా బీసీసీఐ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొందని, వాటిని పరిష్కరించి బీసీసీఐని మేటి బోర్డుగా నిలబెట్టడమే తమ లక్ష్యమన్నారు. గత మూడు ​నెలలుగా క్రికెట్‌ అభివృద్ధి కోసం కొన్ని మార్పులు చేశామని అన్నారు. బీసీసీఐ అధ్యక్షుడిగా తన పనితీరు గురించి గంగూలీని ప్రశ్నించగా.. తనకు ఎన్ని మార్కులు పడతాయో చెప్పడం కష్టమని, తన దృష్టంతా క్రికెట్‌ను అభివృద్ది పరచడంపైనే ఉంటుందన్నారు. టీమిండియా గురించి స్పందిస్తూ.. విరాట్‌ కోహ్లి నాయకత్వంలో అనేక విజయాలు అందుకుందని అన్నారు. అక్టోబర్‌లో అధ్యక్షుడిగా ఎన్నికైన గంగూలీ, నవంబర్‌లో జరిగిన టీమిండియా మొట్టమొదటి డే-నైట్ టెస్ట్ నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు