ధోని కూడా మనిషేగా : గంగూలీ

13 Apr, 2019 10:14 IST|Sakshi

జైపూర్‌ : ఐపీఎల్‌ సీజన్‌ 12లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై కెప్టెన్‌ ధోని అనుచిత ప్రవర్తన పట్ల అతడి వీరాభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘మిస్టర్‌ కూల్‌’ గా పిలుచుకునే ధోని అంపైర్లతో వాదనకు దిగడంపై సీనియర్‌ ఆటగాళ్లు సహా ఫ్యాన్స్‌ కూడా ఘాటుగా స్పందిస్తున్నారు. ‘భారత క్రికెట్‌లో తన బలమేమిటో చూపించాడు. ఆటకంటే గొప్ప వ్యక్తి అన్నట్లుగా బీసీసీఐ ధోనిని చూస్తుంది కాబట్టి అతను అలా చేయగలిగాడు’ అంటూ తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. మైదానంలో దుందుడుకుగా, అవమానకర రీతిలో ప్రవర్తించినప్పటికీ.. నిర్వాహకులు కేవలం మ్యాచ్‌ ఫీజులో 50 శాతం కోత విధించడంతో సరిపెట్టి సిగ్గు లేకుండా అమిత ఉదారత ప్రదర్శించారంటూ దిగ్గజ ఆటగాళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ వివాదంపై స్పందించిన టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ మాత్రం ధోనికి అండగా నిలిచాడు. ‘ ప్రతి ఒక్కరూ మనుషులే కదా. తనలో పోటీతత్త్వం ఉంది. ఇది నిజంగా ఓ విచిత్రమైన సందర్భం’ అంటూ ధోని పట్ల మెతక వైఖరి ప్రదర్శించాడు. ఇక తను అడ్వైజర్‌గా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయం గురించి మాట్లాడుతూ.. శుక్రవారం నాటి ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నానని పేర్కొన్నాడు.

ఇంతకీ వివాదం ఏంటంటే..
గురువారం జైపూర్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో.. టాపార్డర్‌ విఫలం కావడంతో ఛేజింగ్‌ బాధ్యతను భుజాన వేసుకున్న ధోనిని.. స్టోక్స్‌ పెవిలియన్‌కు చేర్చాడు. అయితే అతడు డగౌట్‌ చేరిన మరుసటి బంతికే వివాదం చెలరేగింది. గెలుపు కోసం చెన్నై 3 బంతుల్లో 8 పరుగులు చేయాల్సిన తరుణంలో క్రీజులోకి వచ్చిన టెయిలెండర్‌ సాంట్నర్‌ 2 పరుగులు చేశాడు. అయితే ప్రధాన అంపైర్‌ దీనిని తొలుత హైట్‌ నోబాల్‌గా ప్రకటించి... ఆ తర్వాత లెగ్‌ అంపైర్‌ కాదనడంతో వెంటనే చేతిని దించేశాడు. ఈ క్రమంలో అయోమయం నెలకొనడంతో నాన్‌- స్ట్రైక్లో ఉన్న జడేజా మొదట అంపైర్లను ప్రశ్నించాడు. తర్వాత కెప్టెన్‌ ధోని కూడా మైదానంలోకి వచ్చి మరీ అంపైర్లతో వాదించాడు. కానీ అంపైర్లు అది నోబాల్‌ కాదనడంతో చేసేదేమీలేక ధోని నిరాశగా డగౌట్‌ చేరాడు. ఈ క్రమంలో ధోని అనుచిత ప్రవర్తనపై పలు ఆటగాళ్లు విమర్శలు ఎక్కుపెట్టారు.

ధోని ప్రవర్తనపై వివిధ ఆటగాళ్ల అభిప్రాయాలు
‘ఈ దేశంలో ధోని ఏమైనా చేయగలడని నాకు తెలుసు. కానీ మైదానంలోకి వెళ్లి అంపైర్ల వైపు వేలు చూపడం మాత్రం పెద్ద తప్పు’
మైకేల్‌ వాన్‌

‘అంపైరింగ్‌ నాసిరకంగా ఉందనేది ఒప్పుకుంటాను. కానీ ప్రత్యర్థి కెప్టెన్‌కు పిచ్‌పై వెళ్లే హక్కు ఏమాత్రం లేదు. ధోని తప్పుడు సంప్రదాయానికి తెర తీశాడు’
 ఆకాశ్‌ చోప్రా  

‘ఇది ఊర్లో ఆడుకునే క్రికెట్టో లేక అండర్‌–10 క్రికెట్‌ కాదు. ధోని తాను ఆటగాడిననే విషయం మరచిపోయినట్లున్నాడు. క్రికెటర్లు అంపైర్లను శాసించకూడదు’
షాన్‌ టెయిట్‌  

‘కెప్టెన్‌ మైదానంలోకి దూసుకుపోయి అంపైర్లతో వాదించడం ఎప్పుడూ చూసి ఉండరు. నమ్మలేకపోతున్నాను’
మైకేల్‌ స్లేటర్‌  

‘ధోని హద్దు దాటాడనేది వాస్తవం. కేవలం జరిమానాతో తప్పించుకోవడం అతని అదృష్టం’
సంజయ్‌ మంజ్రేకర్‌  

‘బయటినుంచి ఆటగాళ్లు మైదానంలోకి రావడం పూర్తిగా నిషేధం. కాబట్టి ధోని చేసింది పూర్తిగా తప్పు. 50 శాతం జరిమానా అనేది చాలా చిన్న విషయం ’
హరిహరన్, మాజీ అంపైర్‌  

చదవండి : ధోని దాదాగిరి

మరిన్ని వార్తలు