ఆ విషయంలో అశ్విన్‌ విఫలమవుతున్నాడు : గంగూలీ

26 Dec, 2018 17:12 IST|Sakshi

టీమిండియా ప్రధాన స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ లేనిలోటు జట్టుపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని భారత క్రికెట్‌ జట్టు మాజీ సారథి సౌరవ్‌ గంగూలీ అభిప్రాయపడ్డాడు. ‘ అశ్విన్‌ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే నాకు చాలా ఆందోళనగా ఉంది. గాయాల కారణంగా ప్రతిష్టాత్మక సిరీస్‌లకు సైతం తను అందుబాటులో ఉండలేకపోతున్నాడు. గతంలో... ఇంగ్లండ్‌, దక్షిణాఫ్రికా ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్‌కు అతడు దూరమయ్యాడు. లెఫ్ట్‌ హ్యాండ్‌ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసేందుకు జట్టుకు అశ్విన్‌ అవసరం ఎంతగానో ఉంది. కానీ తనకు ఉన్న ప్రతిభను ఉపయోగించుకోవడంలో అతడు విఫలమవుతున్నాడు’  అంటూ టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా కాలమ్‌లో గంగూలీ రాసుకొచ్చాడు. ఫిట్‌నెస్‌పై దృష్టి పెడితేనే తనకు, జట్టుకు ఉపయోగకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు.

అదే విధంగా జట్టు ఎంపికపై సెలక్టర్లు అనుసరిస్తున్న విధానాన్ని కూడా గంగూలీ తప్పుబట్టాడు. రెండు టెస్టులకు ఓసారి జట్టును మార్చడం సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డాడు. అరంగేట్ర మ్యాచ్‌ ఆడుతున్న మయాంక్‌ వంటి యువ ఆటగాళ్లను వార్మప్‌ మ్యాచులు లేకుండా ఏకంగా బరిలోకి దింపడం వారిపై ఒత్తిడి పెంచినట్లే అవుతుందన్నాడు. అయితే తొలి టెస్టులో చారిత్రాత్మక విజయం సాధించిన టీమిండియాకు... రెండో టెస్టు ఫలితం ఎలా ఉన్నప్పటికీ సిరీస్‌ గెలిచే అవకాశాలు మాత్రం పుష్కలంగానే ఉన్నాయని పేర్కొన్నాడు.

కాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా.. తొలి టెస్టులో టీమిండియా 31 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అడిలైడ్‌లో జరిగిన ఈ మ్యాచులో అశ్విన్ ఆరు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే రెండో టెస్టు ఆరంభానికి ముందే గాయపడిన అశ్విన్‌ జట్టుకు దూరమయ్యాడు. ఇక రెండో టెస్టులో బ్యాట్స్‌మెన్‌ వైఫల్యంతో టీమిండియ ఘోర పరాభవం మూటగట్టుకున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు