మమతతో గంగూలీ భేటి

24 Sep, 2015 01:08 IST|Sakshi

కోల్‌కతా : బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) అధ్యక్ష పదవి చేపడతాడని వస్తున్న ఊహగానాల నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బుధవారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటి అయ్యారు. దివంగత అధ్యక్షుడు జగ్‌మోహన్ దాల్మియా కుమారుడు అవిషేక్‌తో కలిసి సచివాలయానికి వచ్చిన దాదా గంటపాటు సీఎంతో సమావేశమయ్యారు. అయితే సమావేశ వివరాలతో పాటు క్యాబ్ అధ్యక్ష పదవిని చేపట్టే అంశంపై మాట్లాడేందుకు గంగూలీ నిరాకరించారు. ‘దాల్మియా చనిపోయి మూడు రోజులే అయ్యింది. ఇలాంటి అంశాలపై ఇప్పుడే చర్చించడం సరైంది కాదు. అయితే ఎవరో ఒకరు మాత్రం క్యాబ్‌ను నడిపిస్తారు’ అని దాదా వ్యాఖ్యానించారు.

తనకు అత్యంత ఆప్తుడిని కోల్పోయానని దాల్మియాకు నివాళులు అర్పించిన గంగూలీ... చిన్నతనం నుంచి ఆయన ముందే పెరిగానని గతాన్ని గుర్తు చేసుకున్నారు. క్యాబ్ అధ్యక్ష పీఠం దాదాకే అని కథనాలు వెలువడుతున్నా.. రేసులో చాలా మంది పెద్ద వాళ్లు బరిలో ఉన్నారు. చిత్రక్ మిత్రా, గౌతమ్ దాసుగుప్తా, టీఎంసీ సీనియర్ నాయకుడు సుబ్రతా ముఖర్జీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. అయితే గంగూలీ బెంగాల్‌కు గర్వకారణమని చెప్పిన ఆ రాష్ట్ర మంత్రి ఒకరు... క్యాబ్ వ్యవహారాల్లో తమ ప్రభుత్వం జోక్యం చేసుకోబోదని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు