కేవలం కోచ్‌ మాత్రమే కాదు... స్నేహితుడు

14 Jun, 2019 23:01 IST|Sakshi

జాన్‌రైట్‌పై గంగూలీ ప్రశంసలు

నాటింగ్‌హామ్‌: టీమిండియా మాజీ కోచ్‌ జాన్‌రైట్‌పై మాజీ కెప్టెన్‌ సౌరభ్‌ గంగూలీ ప్రశంసల జల్లు కురిపించాడు. జాన్‌రైట్‌ తనకు ఇష్టమైన కోచ్‌.. అంతకంటే ఎక్కువగా మంచి స్నేహితుడని పేర్కొన్నాడు. ప్రస్తు తం వరల్డ్‌కప్‌లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న గంగూలీ గురువారం భారత్, న్యూజిలాండ్‌ మధ్య రద్దైన మ్యాచ్‌లో కాసేపు జాన్‌రైట్‌తో కలసి తన అనుభవాలను పంచుకున్నాడు. ఆ వీడియోను శుక్రవారం ఐసీసీ తన అధికారిక ట్విట్టర్‌లో షేర్‌ చేసింది. 
‘2000వ సంవత్సరంలో జాన్‌రైట్‌ను తొలిసారి కెంట్‌(ఇంగ్లండ్‌)లో చూశాను. అతన్ని నాకు ద్రవిడ్‌ పరిచయం చేశాడు. జాన్‌రైట్‌తో పనిచేయడాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తాను అని అప్పుడే ద్రవిడ్‌కు చెప్పా. అన్నట్లే మా మధ్య కోచ్, ఆటగాడిలా కాకుండా ఒక మంచి స్నేహబంధం ఏర్పడింది. నిజం చెప్పాలంటే అతనకు నాకు కోచ్‌గా కన్నా స్నేహితుడిగానే ఎక్కువ చేరువ. మేమిద్దరం ఆట పరంగా ఒకర్నొకరం చాలా బాగా అర్థం చేసుకున్నాం. అతడు నాకు నమ్మకమైన, నిజమైన స్నేహితుడు’అని ఆ వీడియోలో గంగూలీ పేర్కొన్నాడు.
కాగా, న్యూజిలాండ్‌కు చెందిన జాన్‌రైట్‌ భారత జట్టుకు తొలి విదేశీ కోచ్‌. 2000–2005 మధ్య ఐదేళ్ల పాటు అతను కోచ్‌గా పనిచేశాడు. జాన్‌ రైట్‌ శిక్షణలోనే భారత్‌ 2003 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌కు చేరుకుంది. 2002 నాట్‌వెస్ట్‌ సిరీ స్‌ను కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై టెస్ట్‌ సిరీస్‌ను డ్రాగా ముగించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై వన్డే సిరీస్‌నూ కైవసం చేసుకుంది.

మరిన్ని వార్తలు