అలా కుదరదు బుమ్రా..!

21 Dec, 2019 02:33 IST|Sakshi

పేసర్‌ ఫిట్‌నెస్‌ టెస్టుకు ‘ఎన్‌సీఏ’ నో

గంగూలీ జోక్యం

బుమ్రా ‘సొంత’ ఉత్సాహంపై జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) నీళ్లుచల్లింది. తనకు తానుగా చేసుకున్న పునరావాసంపై ఫిట్‌నెస్‌ టెస్టు నిర్వహించలేమని సూటిగా, సున్నితంగా చెప్పింది. తద్వారా ఎంతటి స్టార్‌ క్రికెటర్‌ అయినా ఎన్‌సీఏనే పెద్దదిక్కని చెప్పకనే చెప్పింది.  

ముంబై: భారత స్పీడ్‌స్టర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాకు జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) షాక్‌ ఇచ్చింది. స్టార్‌ పేసర్‌కు ఫిట్‌నెస్‌ టెస్టు నిర్వహించలేమని సుతిమెత్తగా చెప్పింది. వెన్ను గాయం నుంచి కోలుకున్న అతను పునరాగమనం చేయాలంటే ఎన్‌సీఏలో ఫిట్‌నెస్‌ టెస్టు పాస్‌ కావాల్సిందే. ఈ టెస్టు రిపోర్టు ఆధారంగానే సీనియర్‌ సెలెక్షన్‌ కమిటీ ఎంపిక ప్రక్రియపై నిర్ణయం తీసుకుంటుంది. గాయం నుంచి కోలుకునేందుకు బుమ్రా అకాడమీని కాదని,  తన పునరావాసాన్ని తను చూసుకోవడం తగదని... అతనెలా పురోగతి సాధించాడో తెలియకుండా, క్రమం తప్పకుండా సమీక్షించకుండా... ఉన్నపళంగా ఫిట్‌నెస్‌ టెస్టు నిర్వహించడం కుదరదని రాహుల్‌ ద్రవిడ్‌ డైరెక్టర్‌గా ఉన్న ఎన్‌సీఏ సున్నితంగా ఆ పేసర్‌కు చెప్పేసింది.

ఇక బరిలోకి దిగడమే తరువాయి అనుకుని,  ఇటీవల విశాఖపట్నంలో భారత జట్టు సభ్యులతో కలిసి నెట్స్‌లో పాల్గొన్న బుమ్రాకిది ఊహించని పరిణామమే! నిజానికి బుమ్రాకు ఫిట్‌నెస్‌ పరీక్ష పెట్టేందుకు ఎన్‌సీఏ టీమిండియా ట్రెయినర్‌ నిక్‌ వెబ్‌ను బెంగళూరుకు పిలవాలనుకుంది. కానీ ఎక్కడైనా... ఎప్పుడైనా వ్యవస్థలో ఓ పద్ధతిని అనుసరించే ద్రవిడ్‌ బుమ్రా ‘సొంత’ తెలివితేటలపై గుర్రుగా ఉన్నాడు. అంతా బాగయ్యాక ఇక ఇక్కడెందుకు పరీక్షని భావించాడు. పేసర్‌కు టెస్టు నిర్వహించడం లేదని టీమిండియా అసిస్టెంట్‌ ట్రెయినర్‌ యోగేశ్‌ పర్మార్‌కు స్పష్టం చేసినట్లు తెలిసింది. దీనిపై ద్రవిడ్‌ స్పందన తెలుసుకునేందుకు మీడియా ప్రయతి్నంచగా అతను అందుబాటులోకి రాలేదు. ఇటు బుమ్రా వివరణ కోరేందుకు వెళ్లినా ఫలితం లేకపోయింది.

అసలేం చేయాలి...
భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ)  కాంట్రాక్టు ప్లేయర్‌ ఎవరైనా గాయపడితే ఎన్‌సీఏ  పునరావాస శిబిరంలో పాల్గొనాల్సిందే. ఇక్కడ అకాడమీ డైరెక్టర్‌ నేతృత్వంలో అనుభవజ్ఞులైన ఫిజియో బృందం, వైద్య సిబ్బంది గాయపడిన ఆటగాడిని ఓ క్రమపద్ధతిలో బాగుచేస్తుంది. గాయాలకు గల కారణాలను విశ్లేషిస్తుంది. దీనివల్ల ఆ క్రికెటర్‌ మళ్లీ గాయపడకుండా ఎన్‌సీఏ బృందం సమష్టిగా చర్యలు తీసుకునే వీలుంటుంది. అంటే ఇక్కడ ఆ క్రికెటర్‌ కెరీర్‌ చాలా కాలం కొనసాగేందుకు అవసరమైన సూచనలు ఇస్తుంది.

అతనేం చేశాడు...
కానీ బుమ్రా గాయం నుంచి ఇప్పుడు బాగయ్యేదాకా అంతా సొంత టీమ్‌ సహకారంతోనే కోలుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో తానొక బోర్డు కాంట్రాక్టు ఆటగాడినన్న సంగతే మరిచాడు. పూర్తిగా ఐపీఎల్‌ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్‌ చెప్పినట్లు నడుచుకున్నాడు. వారు చెప్పినట్లుగా ఢిల్లీ క్యాపిటల్‌ ట్రెయినర్‌ రజనీకాంత్‌ శివజ్ఞానం ఆధ్వర్యంలో ముంబైలో శిక్షణ తీసుకున్నాడు. ఎన్‌సీఏ వర్గాలను సంప్రదించడం గానీ, సూచనలు పాటించడంగానీ ఎప్పుడూ చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్‌సీఏ చివరాఖరికి ఓ ఫిట్‌నెస్‌ టెస్టు పెట్టి పాస్‌ మార్క్‌లు వేస్తే, మళ్లీ అతని గాయం తిరగబెట్టినపుడు అప్పుడంతా ఎన్‌సీఏను, పునరావాస శిబిరం తీరుపై తప్పుబడతారనేది ద్రవిడ్‌ అభిప్రాయం.  

గాయాలకు ‘ఎన్‌సీఏ’ చికిత్స తప్పనిసరి: దాదా
‘అసలు ఏం జరిగిందో ద్రవిడ్‌ను అడిగి తెలుసుకుంటాను. సమస్య ఎక్కడ మొదలైందో తెలుసుకొని పరిష్కరిస్తా. నేను బోర్డు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక ద్రవిడ్‌తో ఎన్‌సీఏ విషయమై భేటీ అయ్యాను. కుర్రాళ్లను తీర్చిదిద్దే అంశంలో అకాడమీలో అతని పరిధిని కూడా పెంచాను. అయితే గాయాలకు ఎన్‌సీఏనే చికిత్స చేస్తుంది. పునరావాస శిబిరాలు ఎన్‌సీఏ ఆధ్వర్యంలోనే జరగాలి. భారత ఆటగాడు ఎవరైనా ఇదే పాటించాలి’ అని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ... తన సహచరుడు ద్రవిడ్‌ను సమర్దించాడు.  

మరిన్ని వార్తలు