ఆ భేటీ.. నా హృదయాన్ని తాకింది!

26 Dec, 2019 14:24 IST|Sakshi

కరాచీ: భారత క్రికెట్‌ జట్టుకు తన దూకుడైన ఆటతో విదేశీ గడ్డపై ఎలా విజయాలు సాధించాలో నేర్పిన మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా కూడా సక్సెస్‌ అవుతాడని పాకిస్తాన్‌ దిగ్గజ స్పిన్నర్‌ సక్లయిన్‌ ముస్తాక్‌ అభిప్రాయపడ్డాడు ఈ మేరకు తనకు గతంలో గంగూలీతో జరిగిన ఓ భేటీని ముస్తాక్‌ గుర్తు చేసుకున్నాడు. తాను కష్ట కాలంలో ఉన్నప్పుడు ఆప్యాయంగా గంగూలీ పలకరించిన తీరు తన హృదయాన్ని తాకిందని ముస్తాక్‌ పేర్కొన్నాడు.  కేవలం గంగూలీ తనతో 48 నిమిషాల పాటు మంచి-చెడు మాట్లాడిన తీరు ఇప్పటికీ తన మదిలో ఉండిపోయిందన్నాడు. రెండు మోకాళ్లకు ఆపరేషన్‌ అయి కోలుకుంటున్న తన వద్దకు సౌరవ్‌ గంగూలీ వచ్చి పరామర్శించడం అతడి గొప్ప హృదయానికి నిదర్శనమన్నాడు.

‘2005-06లో ఇది జరిగింది. ఇంగ్లండ్‌ టూర్‌లో భాగంగా భారత జట్టు ససెక్స్‌తో మూడు రోజుల మ్యాచ్‌ ఆడుతోంది. ఆ మ్యాచ్‌కు గంగూలీ దూరంగా ఉన్నాడు. అప్పట్లో రెండు మోకాళ్లకు ఆపరేషన్‌ అయి నేను డిప్రెషన్‌లో ఉన్నా. క్రికెట్‌లో పునరాగమనం కోసం వేచి చూస్తుండగా..  బాల్కనీలో ఉన్న గంగూలీ ససెక్స్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌కు వచ్చాడు. ఆ తర్వాత ఇద్దరం కలిసి చాయ్‌ తాగాం. ఎలా ఉన్నావు.. గాయం మానిందా.. కుటుంబం ఎలా ఉందని అడిగాడు. ఆ మాటలు నా హృదయాన్ని తాకాయి. ఆ 40 నిమిషాల భేటీలో గంగూలీ అప్యాయంగా పలకరించాడు. ఇది ఎప్పటికీ నా మనసులో ఉండిపోతుంది. ఇక బీసీసీఐ అధ్యక్షుడిగా కూడా గంగూలీ సక్సెస్‌ అవుతాడు’ అని ముస్తాక్‌ ఒక యూట్యూబ్‌ వీడియోలో తెలిపాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు