ఏడు నిమిషాల్లోనే...

16 Jun, 2020 04:19 IST|Sakshi

నాడు భారత కోచ్‌గా ఎంపికైన కిర్‌స్టెన్‌

న్యూఢిల్లీ: భారత క్రికెట్‌ జట్టు పురోగతిలో కోచ్‌గా గ్యారీ కిర్‌స్టెన్‌ పోషించిన పాత్ర ఎంతో ప్రత్యేకం. టెస్టుల్లో టీమిండియా నంబర్‌వన్‌ స్థానానికి చేరుకోవడంతో పాటు 2011 వన్డే ప్రపంచకప్‌ చాంపియన్‌గా నిలవడం కిర్‌స్టెన్‌ హయాంలోనే జరిగింది. తాను కోచ్‌గా ఎంపిక కావడానికి సంబంధించి ఒక ఆసక్తికర అంశాన్ని అతను ఇటీవల పంచుకున్నాడు. కోచింగ్‌పై తనకు ఆసక్తి గానీ, అనుభవం గానీ లేవని... అసలు తనంతట తానుగా ఆ పదవి కోసం దరఖాస్తు కూడా చేసుకోలేదని కిర్‌స్టెన్‌ అన్నాడు. ‘భారత జట్టుకు శిక్షణ ఇవ్వగలవా అంటూ కోచింగ్‌ సెలక్షన్‌ కమిటీ సభ్యుడైన సునీల్‌ గావస్కర్‌నుంచి నాకు మెయిల్‌ వచ్చింది.

ఏదో ఆకాశరామన్న ఉత్తరం అనుకొని పట్టించుకోలేదు. ఇంటర్వ్యూకు హాజరు కాగలవా అంటూ మళ్లీ అలాంటి మెయిల్‌ వస్తే నా భార్యకు చూపించాను. ఆమె కూడా నమ్మలేదు. పొరపాటున నాకు వచ్చిందేమోనని భావించింది. ఎందుకంటే నాకు అప్పటికీ ఎలాంటి కోచింగ్‌ అనుభవం లేదు’ అని కిర్‌స్టెన్‌ చెప్పాడు. చివరకు నిజమని నిర్ధారించుకొని ఇంటర్వ్యూకు వెళ్లాక జట్టు కెప్టెన్‌ అనిల్‌ కుంబ్లే కలిశాడని... తాను కోచ్‌ ఇంటర్వ్యూ కోసం వచ్చానని చెబితే కుంబ్లే పగలబడి నవ్వాడని గ్యారీ గుర్తు చేసుకున్నాడు.

మొత్తంగా 7 నిమిషాల్లోనే తన ఇంటర్వ్యూ పూర్తయిందని, అప్పటికప్పుడు కోచ్‌ అపాయింట్‌మెంట్‌ లెటర్‌ ఇచ్చినట్లు ఈ దక్షిణాఫ్రికా మాజీ ఓపెనర్‌ వెల్లడించాడు. ‘ఇంటర్వ్యూ ప్యానెల్‌లో ఉన్న రవిశాస్త్రి కఠినమైన ప్రశ్న అడిగాడు. భారత జట్టును ఓడించేందుకు మీ దక్షిణాఫ్రికా జట్టు ఏం చేసేదని అతను ప్రశ్నించాడు. నాకు తెలుసు అది చెప్పడం అంత సులువు కాదని. అయితే పూర్తిగా వ్యూహాల గురించి మాట్లాడకుండా మూడు నిమిషాల్లో దానిని వారికి అర్థమయ్యేలా వివరించగలిగాను. భారత జట్టు భవిష్యత్తు గురించి మీ వద్ద ఏదైనా ప్రణాళిక ఉందా అని బోర్డు కార్యదర్శి ప్రశ్నించగా...నన్ను ఎవరూ అడగలేదని, సిద్ధమై రాలేదని చెప్పాను. అయినా సరే ఎంపిక కాగలిగాను’ అని కిర్‌స్టెన్‌ వివరించాడు.  

చాపెల్‌ పేరుతో కాంట్రాక్ట్‌...
ఈ సమయంలో మరో ఆసక్తికర అంశం చోటు చేసుకుంది. తనను ఎంపిక చేస్తూ కాంట్రాక్ట్‌ ఇచ్చాక కోచ్‌ స్థానంలో పేరు చూసుకుంటే గ్యారీ కిర్‌స్టెన్‌కు బదులుగా గ్రెగ్‌ చాపెల్‌ (అంతకు ముందు కోచ్‌) పేరు రాసి ఉంది. దాంతో మీరు తప్పు లెటర్‌ ఇచ్చారంటూ కార్యదర్శికే వెనక్కి ఇచ్చేశాను. ఆయన పెన్‌తో చాపెల్‌ పేరు కొట్టేసి తన పేరు రాసిచ్చారని కిర్‌స్టెన్‌ నవ్వుతూ చెప్పాడు.  

మరిన్ని వార్తలు