సెలక్టర్‌పై దాడి.. గంభీర్‌ గరం!

12 Feb, 2019 15:39 IST|Sakshi

న్యూఢిల్లీ : భారత క్రికెట్‌ జట్టు మాజీ పేసర్, డీడీసీఏ సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ అమిత్‌ భండారిపై జరిగిన దాడి ఘటనపై టీమిండియా మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. దాడి చేసిన ఆ యువ క్రికెటర్‌ను ఏ క్రికెట్‌ ఆడకుండా నిషేధం విధించాలని డిమాండ్‌ చేశాడు. ఇక ఢిల్లీ అండర్‌–23 జట్టులోకి తన ఎంపికను తిరస్కరించినందుకు కక్ష పెంచుకున్న అనూజ్‌ దేడా అనే యువకుడు డీడీసీఏ సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ అయిన అమిత్‌ భండారిపై సోమవారం గుంపుతో కలిసి వచ్చి దాడికి దిగిన విషయం తెలిసిందే. రౌడీల్లా హాకీ స్టిక్స్, ఇనుప రాడ్లు, సైకిల్‌ చైన్లతో అమిత్‌పై దాడి చేయడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఆటగాడే అయిన గంభీర్‌.. ట్విటర్‌ వేదికగా తన ఆగ్రహాన్ని వెల్లగక్కాడు. ‘దేశ రాజధాని నడిబొడ్డున ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం దారుణం. ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లో సహించవద్దు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సదరు ఆటగాడిపై ఏ క్రికెట్‌ ఆడకుండా జీవితకాల నిషేధం విధించాలి’  అని గంభీర్‌ డిమాండ్‌ చేశాడు.

ఈ ఘటనపై మాజీ డాషింగ్‌ ఓపెనర్‌, ఢిల్లీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ సైతం స్పందించాడు. ‘జట్టులో ఎంపికచేయలేదని సెలక్టర్‌పై దాడి చేయడం అమానుషం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అతనిపై కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా.’ అని ట్వీట్‌ చేశారు. దాడికి గురైన 40 ఏళ్ల అమిత్‌ భండారి దేశానికి 2000–2004 మధ్య రెండు వన్డేల్లో ప్రాతినిధ్యం వహించాడు. ఢిల్లీ తరఫున రంజీల్లో 95 మ్యాచ్‌లాడి 314 వికెట్లు తీశాడు. ఇక భండారిపై దాడికి పాల్పడిన అనూజ్‌ దేడాను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు