గంభీర్‌ బ్యాట్స్‌మన్‌ కాదు.. కెప్టెనే..!

28 Apr, 2018 13:52 IST|Sakshi
గౌతం గంభీర్‌ (ఫైల్‌ ఫొటో)

గంభీర్‌కు మద్దతు తెలిపిన సంజయ్‌ మంజ్రేకర్‌

న్యూఢిల్లీ : ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ జట్టు  వరుస పరాజయాలకు నైతిక బాధ్యత వహిస్తూ గౌతం గంభీర్‌ తన కెప్టెన్సీకి గుడ్‌ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై భారత మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ సంజయ్‌ మంజ్రేకర్‌ స్పందించారు. ఢిల్లీకి గంభీర్‌ లాంటి సమర్ధవంతమైన నాయకుడి అవసరముందని అన్నారు. గంభీర్‌ను జట్టు సారథ్య బాధ్యతల నిర్వహణకే ఫ్రాంచైజీ కొనుగోలు చేసిందని అభిప్రాయపడ్డారు.

‘తన సహచర ఆటగాళ్ల పేలవ ప్రదర్శనలతో ఢిల్లీ ఆరు మ్యాచ్‌లలో ఐదింటిని కోల్పోయి ఐపీఎల్‌ పాయింట్ల పట్టికలో అట్డడుగున నిలిచింది. జట్టును ముందుండి నడిపించాల్సింది కెప్టెనే. కానీ, మిగతా ఆటగాళ్ల నుంచి సహకారం లభించక పోవడంతో అతనిపై ఒత్తిడి పెరగడం సహజం. దాంతో గంభీర్‌ కూడా తన ఆటపట్ల శ్రద్ధ పెట్టలేక పోయాడ’ని మంజ్రేకర్‌ పేర్కొన్నారు. ముఖ్యంగా మాక్స్‌వెల్‌ లాంటి గొప్ప బ్యాట్స్‌మెన్‌ వైఫల్యాలు గంభీర్‌ను బాధించి ఉండొచ్చని అన్నారు. టీం సభ్యులందరూ వారి సామర్థ్యాలకు తగ్గట్లు ఆడితే నాయకుడికి ఏ సమస్యలు ఉండవని  ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో అన్నారు.

‘వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న జట్టులో మార్పులు చేయాలనుకోవడం మంచి పనే. అయితే, కొత్త కెప్టెన్‌గా శ్రేయస్‌ అయ్యర్‌ వచ్చినంత మాత్రాన ఢిల్లీ దూసుకుపోతుందని చెప్పలేం. అందరి సమష్టి కృషి ఫలితమే వారికి విజయాలను తెచ్చిపెడుతుంద’ని మంజ్రేకర్‌ చెప్పారు. బౌలింగ్‌ పరంగా కూడా ఢిల్లీ పటిష్టంగా లేదని, న్యూజిలాండ్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ ఒక్కడిపైనే ఆధారపడడం సరైంది కాదని సంజయ్‌ అన్నారు.

మరిన్ని వార్తలు