ధోని రిటైర్మెంట్‌.. గంభీర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

19 Jul, 2019 15:04 IST|Sakshi
గౌతం గంభీర్‌

న్యూఢిల్లీ: టీమిండియా వికెట్‌ కీపర్‌ మహేంద్ర సింగ్‌ ధోని తన కెరీర్‌ చరమాంకంలో ఉన్నాడని, ప్రస్తుత పరిస్థితిపై ఉద్వేగానికి లోనవ్వకుండా స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని మాజీ క్రికెటర్‌, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ సూచించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ధోని రిటైర్మెంట్‌ వ్యవహారంపై స్పందించారు. ధోని కెప్టెన్‌గా ఉన్న సమయంలో కుర్రాళ్లకు ఎక్కువగా చాన్సులు ఇచ్చేవాడని తెలిపారు. ఆస్ట్రేలియాతో జరిగిన ఓ సిరీస్‌లో సెహ్వాగ్, సచిన్‌లతో పాటు తనను కూడా పక్కనబెట్టాలనుకున్నాడని గంభీర్ వెల్లడించారు. యువ ఆటగాళ్ల కోసమే ఆ నిర్ణయం తీసుకున్నాడని వివరించారు. 
 
తదుపరి ప్రపంచకప్ కోసం అత్యుత్తమ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌ను సిద్ధం చేసుకోవడానికి ఇదే సరైన సమయమని గంభీర్ చెప్పుకొచ్చారు. భవిష్యత్తు వికెట్ కీపర్‌గా రిషభ్‌ పంత్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ లేక మరే యువ ఆటగాడికైనా విడివిడిగా అవకాశాలిచ్చి పరీక్షించాలని సూచించారు. ఒక్కొక్కరికి ఏడాదిన్నర పాటు అవకాశం ఇచ్చి ఎవరు బాగా ఆడితే వారిని తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.

మహేంద్రసింగ్‌ ధోని అత్యత్తమ కెప్టెన్‌ అన్న గంభీర్‌.. గెలిస్తే క్రెడిట్‌ అంతా అతనికివ్వడం ఓడితే నిందించడం సరికాదన్నారు. ‘గణంకాలు చూస్తే ధోని అత్యుత్తమ కెప్టెన్‌. కానీ అంతమాత్రాన మిగతా కెప్టెన్‌లు గొప్పవారు కాదని కాదు. సౌరవ్‌ గంగూలీది అద్భుతమైన కెప్టెన్సీ. అతని సారథ్యంలోనే మనం విదేశాల్లో గెలుపునందుకున్నాం. విరాట్‌ కోహ్లి కెప్టెన్సీలో దక్షిణాఫ్రికా గడ్డపై వన్డే సిరీస్‌, ఆసీస్‌లో టెస్ట్‌ సిరీస్‌ గెలిచాం. ధోని రెండు ప్రపంచకప్‌లు తీసుకురావడం నిజం. కానీ ఆ గెలుపు క్రెడిట్‌ను కెప్టెన్‌గా అతనొక్కనికే ఇవ్వడం.. ఓడినప్పుడు నిందించడం మాత్రం సరైంది కాదు. ప్రపంచకప్‌లు, చాంపియన్స్‌ ట్రోఫీ ధోని తీసుకురావచ్చు. కానీ ఇతర కెప్టెన్‌లు కూడా ఆటపరంగా జట్టును అత్యున్నత స్థానానికి తీసుకెళ్లారు.’ అని గంభీర్‌ అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు