జైట్లీ మరణం.. గంభీర్‌ భావోద్వేగ ట్వీట్‌

24 Aug, 2019 20:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బీజేపీ ఆగ్ర నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ(66) మరణం పట్ల యావత్‌ భారతావని విచారం వ్యక్తం చేస్తోంది. జైట్లీతో తమకున్న అనుబంధాన్ని నెమరు వేసుకుంటూ పలువురు రాజీకీయ, సినీ, క్రీడా ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఇప్పటికే బీసీసీఐతో పాటు టీమిండియా తాజా, మాజీ ఆటగాళ్లు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. బీజేపీ ఎంపీ, టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ జైట్లీ మరణంపై భావోద్వేగ ట్వీట్‌ చేశారు. 

‘నాన్న నీకు మాట్లాడాలని చెప్తారు.  నాన్నలాంటి వారు నిన్ను అందరి ముందు ప్రసంగించాలని సూచిస్తారు. తండ్రి నీకు నడక నేర్పిస్తారు. తండ్రిలాంటి వ్యక్తి నీకు పరుగెత్తడం నేర్పిస్తారు. నాన్న నీకు పేరు పెడతాడు. నాన్న సమానులు నీకో గుర్తింపునిస్తారు. నా తండ్రి సమానుడైన అరుణ్‌ జైట్లీ మరణంతో నాలో ఓ భాగం పోయినట్టుంది’ అంటూ భావోద్వేగ సందేశాన్ని గంభీర్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. (చదవండి: ఒకరిది వ్యూహం..మరొకరిది మానవత్వం..ఆ ఇద్దరి వల్లే!)

‘అరుణ్‌ జైట్లీ గారు మరణించారన్న వార్త విని షాకయ్యాను.  ఇతరులకు సహాయం చేసే వ్యక్తిత్వం ఆయనది. నా లాంటి ఎంతో మంది ఆటగాళ్లను ప్రోత్సహించేవారు.  2006లో నా తండ్రి చనిపోయినప్పుడు మా ఇంటికి వచ్చి నన్ను, నా కుటుంబాన్ని ఓదార్చారు. నాలో ధైర్యాన్ని నింపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’అంటూ టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి ట్వీట్‌ చేశాడు. జైట్లీ డీడీసీఏ అధ్యక్షుడిగా పనిచేసిన కాలంలో వీరేంద్ర సెహ్వాగ్‌, గంభీర్‌, ధావన్‌, కోహ్లి వంటి ఆటగాళ్లతో మంచి సాన్నిహిత్యం ఉండేది. ప్రతిభ ఉన్న ఆటగాళ్లను ప్రోత్సహించే జైట్లీ వారికి సరైన అవకాశాలు ఇచ్చేందుకు పాటు పడేవారు. అంతేకాకుండా ఢిల్లీ క్రికెట్‌ అభివృద్దికి తగిన కృషి చేశారు.  

చదవండి: 
అపర చాణక్యుడు.. ట్రబుల్‌ షూటర్‌!
అరుణ్‌ జైట్లీ: క్రికెట్‌తో ఎనలేని అనుబంధం

మరిన్ని వార్తలు