ఆసీస్‌కు నంబర్‌వన్‌ ర్యాంక్‌ ఎలా ఇచ్చారు?

11 May, 2020 13:56 IST|Sakshi

టాప్‌లో ఉండాల్సింది ఆస్ట్రేలియా కాదు..

ర్యాంకింగ్స్‌పై అనుమానులున్నాయ్‌

ఉపఖండంలో ఆసీస్‌ ఏం సాధించింది

గంభీర్‌ ప్రశ్నల వర్షం

న్యూఢిల్లీ: ఇటీవల ఆస్ట్రేలియా జట్టు టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్‌కు ఎగబాకిన సంగతి తెలిసిందే. టీమిండియాను వెనక్కినెట్టి అగ్రస్థానాన్ని చేజిక్కించుకుంది ఆసీస్‌. ఐసీసీ సభ్యత్వం గల దేశాల ప్రదర్శన ఆధారంగా వార్షిక ర్యాంకింగ్స్‌లో ఆసీస్‌ టాప్‌ను దక్కించుకుంది. దాంతో 2016 అక్టోబర్‌ నుంచి టాప్‌లో కొనసాగుతున్న టీమిండియా తన ర్యాంకును కోల్పోయింది. అంతే కాకుండా మూడో స్థానానికి పరిమితమైంది. ఇక్కడ న్యూజిలాండ్‌ రెండో స్థానానికి చేరగా, భారత్‌ మూడో స్థానానికి పడిపోయింది. కాగా, దీనిపై టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అసలు ఆస్ట్రేలియా ఆ సీజన్‌లో ఏం సాధించిందని టాప్‌కు చేరిందని ప్రశ్నించాడు.  అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌పై చాలా అనుమానాలున్నాయని గంభీర్‌ పేర్కొన్నాడు. ఉప ఖండంలో ఆసీస్‌ పరిస్థితి దయనీయంగా ఉంటే నంబర్‌ వన్‌ ర్యాంక్‌ను ఎలా కైవసం చేసుకుందంటూ నిలదీశాడు. (కోహ్లితో నా వైరం ఇప్పటిది కాదు!)

చాలా కాలం నుంచి టీమిండియానే పోటీ క్రికెట్‌ ఆడుతూ  అనేక విజయాలను సాధిస్తే, మరి ఆసీస్‌కు టాప్‌ ర్యాంక్‌ను ఎలా కట్టబెట్టారన్నాడు. ఏ ప్రాతిపదికన ఆసీస్‌ అగ్రస్థానానికి చేరిందో తనకు అర్ధం కావడం​ లేదన్నాడు. భారత్‌ జట్టు ఇక్కడ మూడో ర్యాంకు పడిపోవడంలో పెద్దగా ఆశ్చర్యం ఉండకపోవచ్చు ఎందుకంటే పాయింట్ల విధానం, ర్యాంకింగ్స్‌ విధానం సరిగా లేనప్పుడు ఇలానే జరుగుతుందన్నాడు. ఓవరాల్‌గా చూస్తే ఇప్పుడు కూడా టాప్‌లో ఉండాల్సింది భారత జట్టే కానీ ఆసీస్‌ కాదన్నాడు. ప్రధానంగా టెస్టు చాంపియన్‌షిప్‌ ప్రవేశపెట్టిన తర్వాత స్వదేశంలో మ్యాచ్‌ గెలిచినా, విదేశంలో మ్యాచ్‌ గెలిచినా ఒకే తరహా పాయింట్ల విధానం అనేది చాలా చెత్తగా ఉందని విమర్శించాడు. ఓవరాల్‌ పద్ధతిలో చూస్తే స్వదేశంలో, విదేశాల్లో భారత్‌ ప్రదర్శనే మెరుగ్గా ఉందని, ఇక్కడ టాప్‌లో  నిలిచిన దేశాల పరిస్థితి అలా లేదన్నాడు. కచ్చితంగా ఇలా చూస్తే టీమిండియానే టాప్‌లో ఉండాలన్నాడు. తనకు ఆస్ట్రేలియా ఎలా నంబర్‌ వన్‌ స్థానానికి వెళ్లిందనే విషయంలో తీవ్రమైన అనుమానాలున్నాయన్నాడు. 

మే నెల తొలి వారంలో విడుదల చేసిన కొత్త లెక్కల ప్రకారం ఆస్ట్రేలియా (116 పాయింట్లు) టాప్‌ ర్యాంకుకు చేరగా... న్యూజిలాండ్‌ (115) రెండో స్థానానికి ఎగబాకింది. భారత్‌ (114) మూడో ర్యాంకుకు పడిపోయింది. అయితే 2003లో టెస్టు ర్యాంకుల్ని ప్రవేశపెట్టాక టాప్‌–3 జట్ల మధ్య మరీ ఇంత అత్యల్ప వ్యత్యాసం ఉండటం ఇదే మొదటిసారి. కోహ్లి సేన 2016–17 సీజన్‌ నుంచి చక్కని ప్రదర్శనతో వరుసబెట్టి  ఒక్కో సిరీస్‌ గెలుస్తూ వచ్చింది. దీంతో ‘టాప్‌’ ర్యాంకును చేరుకోవడంతోపాటు ఇన్నాళ్లూ పదిలపరుచుకుంది. అలా ఒకటో నంబర్‌ జట్టుగా గదను సగర్వంగా అందుకుంది. అయితే వార్షిక లెక్కల ప్రకారం 2019 మే నుంచి ఫలితాల్ని పరిగణిస్తారు. దీని ప్రకారం ఆసీస్‌ టాప్‌ను దక్కించుకుంది. ఇక్కడ ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌లో మాత్రం భారతే ముందుంది. (మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఉచ్చులో మరో క్రికెటర్‌)

మరిన్ని వార్తలు