నీకు.. 3డీ కామెంట్‌ అవసరమా?: గంభీర్‌

23 May, 2020 11:52 IST|Sakshi
ఎంఎస్‌కే ప్రసాద్‌-గంభీర్‌(ఫైల్‌ఫోటో)

చైర్మన్‌ హోదాలో ఉన్నావనే సంగతి మరిచారా?

మరోసారి అంబటి రాయుడి ఉద్వాసనపై చర్చ

గంభీర్‌-ఎంఎస్‌కే ప్రసాద్‌ల మధ్య వాగ్వాదం

న్యూఢిల్లీ: గతేడాది ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా భారత క్రికెట్‌ జట్టు సెలక్షన్‌ సమయంలో రాద్దాంతం అందరికీ గుర్తుండే ఉంటుంది. ప్రధానంగా మిడిల్‌ ఆర్డర్‌ ఆటగాడు అంబటి రాయుడ్ని కాదని విజయ్‌ శంకర్‌కు చోటు కల్పించడం అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. ముఖ్యంగా ఆల్‌రౌండర్‌ కోటాలో శంకర్‌కు చోటు కల్పించిన బీసీసీఐ సెలక్షన్‌ పెద్దలు.. దాన్ని అప్పట్లో సమర్ధించుకున్నారు కూడా. అప్పుడు బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌గా ఉన్న ఎంఎస్‌కే ప్రసాద్‌.. విజయ్‌ శంకర్‌ను 3డీ ప్లేయర్‌గా అభివర్ణించడం అగ్గిరాజేసింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాలను 3డీతో పోల్చాడు ఎంఎస్‌కే. దాంతో చిర్రెత్తుకొచ్చిన అంబటి రాయుడు.. భారత క్రికెట్‌ జట్టు ఆటను చూడటానికి 3డి కళ్లద్దాలకు ఆర్డర్‌ ఇచ్చానంటూ కాస్త ఘాటుగానే బదులిచ్చాడు. ఇదే అంశంపై ఇప్పుడు మరోసారి ఎంఎస్‌కే నిర్ణయాన్ని తప్పుపట్టాడు మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌. ఒక చీఫ్‌ సెలక్టర్‌(సెలక్షన్‌ చైర్మన్‌) హోదాలో ఆ మాట అనడం సరైనది కాదని గంభీర్‌ పేర్కొన్నాడు. స్టార్‌ స్పోర్ట్స్‌ నిర్వహించిన ‘క్రికెట్‌ కనెక్టెడ్‌’ షోలో గౌతం గంభీర్‌, కృష్ణమాచారి శ్రీకాంత్‌లతో పాటు ఎంఎస్‌కే ప్రసాద్‌ కూడా పాల్గొన్నాడు. ఈ షోలో ఎంఎస్‌కే ప్రశ్నించాడు గంభీర్‌.(ధోనిని ఏనాడు అడగలేదు: రైనా)

‘అంబటి రాయుడు విషయంలో ఏమి జరిగిందో చూశాం. ముఖ్యంగా వరల్డ్‌కప్‌కు ముందు రెండేళ్ల పాటు అతనికి జట్టులో చోటు కల్పిస్తూ వచ్చారు. ఆ రెండేళ్లు నాలుగో స్థానంలో రాయుడు బ్యాటింగ్‌ చేశాడు. మరి వరల్డ్‌కప్‌కు ముందు 3డీ అవసరమైందా.. ఒక చైర్మన్‌ హోదాలో మీరు ఆ మాట మాట్లాడటం భావ్యమా’ అని నిలదీశాడు. దీనికి ఎంఎస్‌కే బదులిస్తూ. ‘ఇంగ్లిష్‌ వాతావరణంలో ఆల్‌రౌండర్‌ ఉండాలనే ఉద్దేశంతోనే శంకర్‌ను ఎంపిక చేశాం. మనకు సీమ్‌ బౌలింగ్‌ పరంగా ఇబ్బంది ఉందనే శంకర్‌ను చివరి నిమిషంలో తీసుకొచ్చాం. శంకర్‌ దేశవాళీ రికార్డులను పరిశీలించిన పిదప అతనికి అవకాశం ఇచ్చాం’ అని తెలిపాడు. కాగా, ఎంఎస్‌కే నిర్ణయాన్ని షోలో ఉన్న శ్రీకాంత్‌ తప్పుబట్టాడు. ఇక్కడ గంభీర్‌ను వెనకేసుకొచ్చి మిమ్మల్ని కించపరచడం లేదంటూనే అంతర్జాతీయ క్రికెట్‌కు దేశవాళీ క్రికెట్‌కు చాలా తేడా ఉంటుందన్నాడు. బౌలింగ్‌ పరంగా శంకర్‌ ఓకే కావొచ్చు...కానీ బ్యాటింగ్‌లో టాపార్డర్‌లోనే దిగాలి కదా.. ఆ విషయాన్ని పట్టించుకోలేదా’ అని శ్రీకాంత్‌ ప్రశ్నించాడు. (మమ్మల్ని ఆడనివ్వండి.. నిజాయితీగా ఉండండి)

మరిన్ని వార్తలు