‘పద్మశ్రీ’ హారిక

26 Jan, 2019 01:01 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌ చెస్‌ స్టార్‌కు కేంద్ర ప్రభుత్వ పౌర పురస్కారం

 పర్వతారోహకురాలు బచేంద్రీ పాల్‌కు ‘పద్మ భూషణ్‌’

క్రికెటర్‌ గంభీర్, ఫుట్‌బాలర్‌ సునీల్‌ చెత్రి, రెజ్లర్‌ బజరంగ్, టీటీ ప్లేయర్‌ శరత్‌ కమల్‌లకు ‘పద్మశ్రీ’

క్రీడా విభాగంలో తొమ్మిది మందికి ‘పద్మ’ అవార్డులు   

అంతర్జాతీయ స్థాయిలో 19 ఏళ్లుగా భారత కీర్తి పతాకాన్ని ఎగురవేస్తోన్న ఆంధ్రప్రదేశ్‌ చెస్‌ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక కెరీర్‌లో మరో కలికితురాయి చేరింది.  గ్రాండ్‌మాస్టర్‌ హారికకు కేంద్ర ప్రభుత్వ పౌర పురస్కారం ‘పద్మశ్రీ’ లభించింది.  70వ గణతంత్ర దినోత్సవ నేపథ్యంలో శుక్రవారం కేంద్రం పద్మ పురస్కారాలను ప్రకటించింది. క్రీడా విభాగంలో మొత్తం తొమ్మిది మందికి ఈ అవార్డులు రాగా... ఉత్తరాఖండ్‌కు చెందిన పర్వతారోహకురాలు బచేంద్రీ పాల్‌కు ‘పద్మభూషణ్‌’ దక్కింది. మిగతా ఎనిమిది మందిని ‘పద్మశ్రీ’ వరించింది.

న్యూఢిల్లీ: క్రీడా ప్రపంచంలో తమ ప్రతిభాపాటవాలతో దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసిన భారత క్రీడాకారులను కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ పురస్కారాలతో గౌరవించింది. వివిధ రంగాల నుంచి మొత్తం 112 మందికి ఈ అవార్డులు రాగా... క్రీడా విభాగం నుంచి తొమ్మిది మంది ఉన్నారు. మౌంట్‌ ఎవరెస్ట్‌ను అధిరోహించిన తొలి భారతీయ మహిళ బచేంద్రీ పాల్‌కు ‘పద్మ భూషణ్‌’ లభించింది. ఉత్తరాఖండ్‌కు చెందిన 64 ఏళ్ల బచేంద్రీ పాల్‌ 1984లో మౌంట్‌ ఎవరెస్ట్‌ను అధిరోహించారు. గతేడాది కామన్వెల్త్‌ గేమ్స్, ఆసియా క్రీడల్లో స్వర్ణాలు, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం గెలిచిన రెజ్లర్‌ బజరంగ్‌ పూనియా... 2007 టి20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచ కప్‌ గెలిచిన భారత క్రికెట్‌ జట్టు సభ్యుడు గౌతమ్‌ గంభీర్‌... భారత ఫుట్‌బాల్‌ జట్టు కెప్టెన్‌ సునీల్‌ చెత్రి... ‘ట్రిపుల్‌ ఒలింపియన్‌’ టేబుల్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ ఆచంట శరత్‌ కమల్‌... భారత కబడ్డీ జట్టు కెప్టెన్‌ అజయ్‌ ఠాకూర్‌లకు ‘పద్మశ్రీ’ అవార్డులు లభించాయి. గతేడాది కామన్వెల్త్‌ గేమ్స్‌లో పురుషుల టీమ్‌ విభాగంలో భారత్‌కు స్వర్ణం దక్కడంలో 36 ఏళ్ల శరత్‌ కమల్‌ కీలకపాత్ర వహించాడు. 2016 కబడ్డీ ప్రపంచకప్‌ భారత్‌కు దక్కడంలో అజయ్‌ ఠాకూర్‌ ముఖ్యపాత్ర పోషించాడు. తెలంగాణలోని సికింద్రాబాద్‌లో జన్మించిన సునీల్‌ చెత్రి జాతీయ పోటీల్లో ఢిల్లీకి ప్రాతినిధ్యం వహిస్తాడు.  

అంచెలంచెలుగా... 
ఆరేళ్ల ప్రాయంలో చెస్‌లో ఓనమాలు దిద్దుకున్న హారిక ఒక్కో మెట్టు ఎక్కుతూ నేడు అంతర్జాతీయ చెస్‌లో మేటి క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. 1991 జనవరి 12న గుంటూరులో జన్మించిన హారిక 2000లో స్పెయిన్‌లో జరిగిన ప్రపంచ యూత్‌ చాంపియన్‌షిప్‌లో అండర్‌–10 బాలికల విభాగంలో రజతం గెలిచి వెలుగులోకి వచ్చింది. ఈ దశలో క్రీడా ప్రేమికులైన హారిక తల్లిదండ్రులు రమేశ్, స్వర్ణ తమ అమ్మాయికి మరింత మెరుగైన శిక్షణ ఇప్పించారు. కోచ్‌ ఎన్‌వీఎస్‌ రామరాజు వద్ద శిక్షణ తీసుకుంటూ హారిక మరింత రాటుదేలింది. అనంతరం ప్రపంచ యూత్‌ చాంపియన్‌షిప్‌లో అండర్‌–12 విభాగంలో రజత, కాంస్యాలు సాధించింది. 2006లో ప్రపంచ యూత్‌ చాంపియన్‌షిప్‌లో అండర్‌–18 విభాగంలో స్వర్ణం... 2008 ప్రపంచ జూనియర్‌ చాంపియన్‌షిప్‌లో పసిడి సాధించిన హారిక... 2009లో ఆసియా మహిళా చాంపియన్‌గా... 2010లో కామన్వెల్త్‌ చాంపియన్‌గా అవతరించింది. 2011లో గ్రాండ్‌మాస్టర్‌ (జీఎం) హోదా పొందిన ఆమె వరుసగా మూడు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో (2012, 2015, 2017) కాంస్య పతకాలను కూడా దక్కించుకుంది. 28 ఏళ్ల హారిక ప్రస్తుతం స్పెయిన్‌లో జరుగుతున్న జిబ్రాల్టర్‌ అంతర్జాతీయ టోర్నమెంట్‌లో పాల్గొంటోంది. హారికకు ‘పద్మశ్రీ’ పురస్కారం రావడంపట్ల ఆమె తల్లిదండ్రులు రమేశ్, స్వర్ణ సంతోషాన్ని వ్యక్తం చేశారు.

క్రీడా పద్మాలు వీరే..
పద్మ భూషణ్‌: బచేంద్రీ పాల్‌ (ఉత్తరాఖండ్‌–పర్వతారోహణ) 
పద్మశ్రీ: ద్రోణవల్లి హారిక (ఆంధ్రప్రదేశ్‌–చెస్‌); బజరంగ్‌ పూనియా (హరియాణా–రెజ్లింగ్‌); సునీల్‌ చెత్రి (తెలంగాణ–ఫుట్‌బాల్‌) 
గంభీర్‌ (ఢిల్లీ–క్రికెట్‌); ఆచంట శరత్‌ కమల్‌ (తమిళనాడు–టేబుల్‌ టెన్నిస్‌); బొంబేలా దేవి (మణిపూర్‌–ఆర్చరీ); ప్రశాంతి సింగ్‌ (ఉత్తరప్రదేశ్‌–బాస్కెట్‌బాల్‌); అజయ్‌ ఠాకూర్‌ (హిమాచల్‌ప్రదేశ్‌–కబడ్డీ)

   

మరిన్ని వార్తలు