భారత్‌ - పాక్‌ మ్యాచ్‌.. బుక్కయిన గంభీర్‌

18 Jun, 2019 09:07 IST|Sakshi

న్యూఢిల్లీ : టీమిండియా మాజీ క్రికెటర్‌, బీజేపీ ఎంపీ గౌతం గంభీర్‌పై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. మీరు కేవలం మాటల మనిషని  నిరూపించుకున్నారు.. దేశం కంటే డబ్బు ముఖ్యం అయ్యిందా అంటూ మండిపడుతున్నారు. గంభీర్‌ను ఇంతలా ట్రోల్‌ చేయడానికి ఓ కారణం ఉంది. పుల్వామా ఉగ్రదాడి జరిగినప్పుడు గంభీర్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రదాడిపై ఘాటుగా స్పందించిన గంభీర్‌ పాక్‌తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని, ప్రపంచకప్‌లో కూడా ఆ జట్టుతో జరిగే మ్యాచ్‌ను బహిష్కరించాలన్నారు. మహా అయితే భారత్‌ రెండు పాయింట్లు కోల్పోతుందని, ఆట కన్నా దేశ ప్రజల సెంటిమెంట్‌ ముఖ్యమని అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ విషయంపై తీవ్ర చర్చ కూడా జరిగింది. మాజీ ఆటగాళ్లు, అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. బీసీసీఐ కూడా పాక్‌తో మ్యాచ్‌ విషయంలో కేంద్రప్రభుత్వ ఆదేశాల మేరకే నడుచుకుంటామని స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో ఆదివారం జరిగిన భారత్‌-పాక్‌ మ్యాచ్ సందర్భంగా గంభీర్‌ చేసిన ట్వీట్‌ నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. అంతేకాక ఈ మాజీ క్రికెటర్‌ స్టార్‌ స్పోర్ట్స్‌ చానెల్‌లో దర్శనమివ్వడం.. మ్యాచ్‌ విశ్లేషకుడిగా అవతారం ఎత్తడం పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘అసలు పాకిస్తాన్‌తో మ్యాచే వద్దన్న నువ్వు.. ఇప్పుడు డబ్బు కోసం భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు విశ్లేషకుడిగా వ్యవహరిస్తావా.. నీ కపటత్వం జనాలకు తెలిసిపోయింది’ అంటూ ట్రోల్‌ చేయడమే కాక గంభీర్‌ గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను ట్విటర్‌లో షేర్‌ చేయడం ప్రారంభించారు. తను వ్యతిరేకించిన మ్యాచ్‌తోనే గంభీర్‌ డబ్బు సంపాదించుకుంటున్నాడంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు