భారత క్రికెటర్ గంభీర్ సూటి ప్రశ్న!

27 Oct, 2017 18:57 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సినిమా హాళ్లలో జాతీయగీతం ప్రదర్శన, లేచి నిల్చోవడం వివాదంపై టీమిండియా క్రికెటర్ గౌతం గంభీర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. కొన్ని సెకన్లపాటు నిల్చోలేరా అని సోషల్ మీడియా ద్వారా ప్రశ్నించారు. దేశభక్తి రుజువు చేసుకోవాలంటే థియేటర్లలో జాతీయగీతం ప్లే అవుతున్నప్పుడు లేచి నిల్చోవాల్సిన అవసరం లేదని, ఆ సమయంలో ఎవరైనా లేచి నిల్చోకపోతే వారిలో దేశభక్తి లేదని భావించలేమని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీనిపై పలు రంగాల వ్యక్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా క్రికెటర్ గంభీర్ ఈ వివాదంపై ఆసక్తికర ట్వీట్ చేశారు.

మనకు నచ్చిన ఎన్నో విలాసవంతమైన ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఎంతో సమయం వేచి చూడటం అలవాటే కదా, అలాంటప్పుడు థియేటర్లలో కాసేపు నిల్చోవడం వల్ల ఏ సమస్య వచ్చిందని గంభీర్ ప్రశ్నించారు. 'క్లబ్ బయట నిల్చుని 20 నిమిషాలు, ఇష్టమైన రెస్టారెంట్ ఎదుట 30 నిమిషాల పాటు ఎదురుచూస్తారు. జాతీయగీతం కోసం కేవలం 52 సెకన్లపాటు నిల్చోలేకపోతున్నారా' అని ప్రశ్నిస్తూ గంభీర్ ట్వీట్ చేశారు.

ఇతర క్రికెటర్ల సంగతి పక్కనపెడితే.. గంభీర్‌కు దేశభక్తి ఎక్కువన్న విషయం తెలిసిందే. దేశం కోసం పోరాడి అమరులైన అనేక మంది జవాన్ల పిల్లల్ని చదివిస్తున్నాడు. ఇటీవల చనిపోయిన ఓ జవాన్ కూతురు చదువుకు, ఆమె భవిష్యత్తుకు భరోసా కల్పించి అందరి ప్రశంసలందుకున్నారు గంభీర్. ఐపీఎల్‌ ద్వారం అందుకున్న మొత్తాన్ని అమరవీరుల కుటుంబాలకు విరాళంగా ప్రకటించిన గౌతం గంభీర్‌ మరోవైపు తన పేరుతో నెలకొల్పిన ఫౌండేషన్‌ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు