‘అమెరికాలో అందరికీ స్వేచ్ఛ, న్యాయం ఉందా?’

3 Jun, 2020 10:23 IST|Sakshi

న్యూఢిల్లీ:  జార్జ్‌ ఫ్లాయిడ్ అనే నల్లజాతియుడిని శ్వేత జాతి పోలీసు అధికారి కాలితో తొక్కి చంపిన నేపథ్యంలో అమెరికాలో తీవ్ర ఆ​గ్రహజ్వాలలు ఎగిసిపడుతున్నాయి. పలు రాష్ట్రాల్లో ఆందోళనలు తీవ్రంగా కొనసాగుతున్నాయి. ప్రధానంగా అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌‌వద్ద భారీ స్థాయిలో నిరసనలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇక తాజాగా జాత్యహంకారంపై క్రీడా లోకం కూడా మండిపడుతోంది. ఇప్పటికే ఫార్ములావన్‌ రేసర్లు, క్రికెట్‌, గోల్ఫ్‌ ఆటగాళ్లు  వర్ణ వివక్ష హత్యపై మండిపడ్డారు. తాజాగా ఫ్లాయిడ్‌ మరణంపై అమెరికన్‌ ఫుట్‌ బాలర్‌ డీఅండ్రీ ఎడ్లిన్‌ స్పందించాడు. (క్రికెట్‌ ప్రపంచం గళం విప్పాల్సిందే)

‘జార్జ్‌ ఫ్లాయిడ్‌ మరణం అనంతరం మా తాత ఒక సందేశం పంపారు. అమెరికాలో నివసించనందుకు చాలా సంతోషంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే  నాకు ఏమైనా అవుతుందో అనే భయం ఆయనలో నెలకొంది. ఎందుకంటే నేను కూడా నల్లజాతీయుడినే కదా. చిన్నప్పుడు స్కూళ్లో చేసిన ప్రతిజ్ఞ గుర్తుతెచ్చుకుంటే.. అందరికీ స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, న్యాయం అంటూ చివర్లో చదువుతాం. ఇప్పుడు అమెరికన్లు అందరూ గుండెలపై చేతులు వేసుకొని ఇక్కడ అందరికీ స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, న్యాయం ఉందా అని చెప్పగలారా?’ అంటూ ఓ భావోద్వేగ సందేశాన్ని సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. (జార్జ్ హత్య : సత్య నాదెళ్ల స్పందన)

మరిన్ని వార్తలు