జర్మనీ జాతర...బ్రెజిల్ పాతర

10 Jul, 2014 00:34 IST|Sakshi
జర్మనీ జాతర...బ్రెజిల్ పాతర

 సెమీస్‌లో జర్మనీ విశ్వరూపం
 7-1తో బ్రెజిల్‌పై విజయం  
 6 నిమిషాల్లో 4 గోల్స్
 
 ఆశ్చర్యమే ఆశ్చర్యపోయింది. ఊచకోతే ఉలిక్కిపడింది. విధ్వంసమే విస్తుపోయింది. కలలో కూడా ఊహించనిది జరిగింది.ఒకటా... రెండా... మూడా... నాలుగా... ఎవ్వరూ ఊహించనివిధంగా ఏకంగా ఏడు గోల్స్ సమర్పించుకొని ఆతిథ్య బ్రెజిల్ జట్టు తమ అభిమానులందరినీ తలదించుకునేలా చేసింది. దూకుడే మంత్రంగా ఆడిన జర్మనీ తమ గోల్స్ జాతరలో బ్రెజిల్‌ను పాతరేసింది.
 
 ఆరు నిమిషాల వ్యవధిలో నాలుగు గోల్స్ చేసి బ్రెజిల్‌ను బెంబేలెత్తించింది.
 ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత ఏకపక్షంగా జరిగిన సెమీఫైనల్లో జర్మనీ 7-1 గోల్స్ తేడాతో బ్రెజిల్‌ను చిత్తు చేసి ఎనిమిదోసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘రక్షణశ్రేణి’ అనే పదానికి విలువలేకుండా చేసిన బ్రెజిల్ తొలి 29 నిమిషాల్లోనే ఐదు గోల్స్ అర్పించుకొని తొలి అర్ధభాగంలోనే పరాజయాన్ని ఖాయం చేసుకుంది. తమ దేశ ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత ఘోరమైన ఓటమిని మూటగట్టుకున్న బ్రెజిల్ ప్రపంచవ్యాప్తంగా తమను ఆరాధించే, అభిమానించే వారందరినీ శోకసంద్రంలో ముంచేసింది.
 
 బెలో హారిజాంట్: అగ్ని పరీక్షలో ఆతిథ్య జట్టు ఆహుతైపోయింది. జర్మనీ జట్టు ‘నభూతో నభవిష్యత్’ అన్నరీతిలో చెలరేగిపోయింది. బ్రెజిల్‌ను ఇప్పట్లో కోలుకోలేనివిధంగా దెబ్బతీసింది. గాయం కారణంగా స్టార్ ప్లేయర్ నెయ్‌మార్... సస్పెన్షన్ కారణంగా కెప్టెన్, డిఫెండర్ థియాగో సిల్వా లేకపోవడంతో డీలా పడిన బ్రెజిల్‌పై సంపూర్ణ ఆధిపత్యం చలాయించిన జర్మనీ చిరకాలం గుర్తుండిపోయే విజయాన్ని సాధించింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ప్రపంచకప్ తొలి సెమీఫైనల్లో జర్మనీ 7-1 గోల్స్ తేడాతో బ్రెజిల్‌ను చిత్తు చేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. మూడో స్థానం కోసం శనివారం జరిగే మ్యాచ్‌లో బ్రెజిల్ ఆడుతుంది.
 
 నెయ్‌మార్ కోసం గెలవాలని, అతనికి ‘కప్’ కానుకగా ఇవ్వాలనే ఏకైక లక్ష్యంతో సెమీఫైనల్ బరిలోకి దిగిన బ్రెజిల్ తొలి 10 నిమిషాలు ‘పట్టు’ కోల్పోకుండా ఆడుతున్నట్లు కనిపించింది.
 
 అయితే జర్మనీ 11వ నిమిషంలో సంపాదించిన తొలి కార్నర్.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది. టోనీ క్రూస్ సంధించిన క్రాస్ షాట్‌ను నేరుగా గోల్‌పోస్ట్ ముందు అందుకున్న థామస్ ముల్లర్ బంతిని లక్ష్యానికి చేర్చాడు. ముల్లర్‌కు సమీపంలో గోల్‌కీపర్‌తో కలిపి మొత్తం 9 మంది బ్రెజిల్ ఆటగాళ్లు ఉన్నా వారందరూ ప్రేక్షకపాత్ర వహించారు. ఆరంభంలోనే షాక్ తిన్న బ్రెజిల్ తేరుకునేందుకు ప్రయత్నించేలోపు జర్మనీ జోరు పెంచింది. ఒకదశలోనైతే అసలు బ్రెజిల్ జట్టుకు రక్షణశ్రేణి ఆటగాళ్లు ఉన్నారా అనే అనుమానం కలిగింది.
 
 23వ నిమిషంలో క్లోజ్ కొట్టిన షాట్‌ను బ్రెజిల్ గోల్‌కీపర్  సీజర్ నిలువరించగా బంతి తిరిగి క్లోజ్ వద్దకే వచ్చింది. ఈసారి క్లోజ్ ఎలాంటి పొరపాటు చేయకుండా కీపర్‌ను, డిఫెండర్లను తప్పిస్తూ బంతిని గోల్‌పోస్ట్‌లోనికి పంపి జర్మనీకి 2-0 ఆధిక్యాన్నిచ్చాడు.
 
 రెండో గోల్ తర్వాత జర్మనీ ఆటగాళ్లు విశ్వరూపాన్ని ప్రదర్శించారు. బ్రెజిల్ డిఫెండర్లను చెల్లాచెదురు చేస్తూ ఎడతెరిపి లేకుండా దాడులు చేశారు. 24వ నిమిషంలో, 26వ నిమిషంలో టోనీ క్రూస్ రెండు గోల్స్ చేయగా... 29వ నిమిషంలో సమీ ఖెడిరా ఒక గోల్ సాధించాడు. దాంతో జర్మనీ 29 నిమిషాలు పూర్తయ్యే సమయానికి ఎవ్వరూ ఊహించనివిధంగా 5-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అప్పటికే ఓటమి ఖాయం చేసుకున్న బ్రెజిల్ తొలి అర్ధభాగంలో మరో గోల్ ఇవ్వకుండా జాగ్రత్త పడింది.
 
 ద్వితీయార్ధభాగం తొలి 10 నిమిషాల్లో బ్రెజిల్ ఆటగాళ్లు దూకుడుగా ఆడారు. మ్యాచ్‌లోనే తొలిసారిగా 51వ నిమిషంలో జర్మనీ గోల్‌పోస్ట్‌పై దాడి చేశారు. అదే జోరులో నాలుగుసార్లు గోల్ చేసే అవకాశాలను సృష్టించుకున్నా జర్మనీ గోల్‌కీపర్ నెయుర్ అడ్డుగోడలా నిలబడి వారి ఆశలను వమ్ముచేశాడు.
 
 కొన్ని నిమిషాలు బ్రెజిల్‌కు ఊరటనిచ్చిన జర్మనీ ద్వితీయార్ధంలో 20 నిమిషాల తర్వాత మళ్లీ జోరు పెంచింది. 69వ నిమిషంలో, 79వ నిమిషంలో షుర్లే రెండు గోల్స్ చేసి జర్మనీ ఆధిక్యాన్ని 7-0కు పెంచాడు. ఇక బ్రెజిల్ ఖాతా తెరవదేమో అని అనుకుంటున్న తరుణంలో ఆట 90వ నిమిషంలో ఆస్కార్ తొలి గోల్ చేశాడు.
 
 స్కోరు బోర్డు
 జర్మనీ: 7
 ముల్లర్: 11వ, క్లోజ్: 23వ,
 క్రూస్: 24వ, 26వ,
 సమీ ఖెడిరా: 29వ,
 షుర్లే: 69వ, 79వ  ని.
 బ్రెజిల్: 1  ఆస్కార్: 90వ ని.
 
 ‘టాప్’ క్లోజ్...
 హా ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన క్రీడాకారుడిగా జర్మనీ వెటరన్ ప్లేయర్ మిరోస్లావ్ క్లోజ్ రికార్డు పుటల్లోకి ఎక్కాడు. బ్రెజిల్‌తో జరిగిన సెమీఫైనల్లో ఆట 23వ నిమిషంలో క్లోజ్ గోల్ చేయడంతో ఇప్పటిదాకా 15 గోల్స్‌తో బ్రెజిల్ దిగ్గజం రొనాల్డో పేరిట ఉన్న ఈ రికార్డు తెరమరుగైంది. రొనాల్డో 19 మ్యాచ్‌ల్లో 15 గోల్స్ చేయగా... క్లోజ్ 23 మ్యాచ్‌ల్లో 16 గోల్స్ సాధించాడు. 35 ఏళ్ల క్లోజ్‌కిది వరుసగా నాలుగో ప్రపంచకప్ కావడం విశేషం. ఇప్పటిదాకా క్లోజ్ ‘గోల్’ చేసిన ఏ మ్యాచ్‌లోనూ జర్మనీ ఓడిపోలేదు.
 
 హా 2002 ప్రపంచకప్ ఫైనల్లో జర్మనీపై రొనాల్డో రెండు గోల్స్ చేసి అత్యధిక గోల్స్ రికార్డు సాధించాడు.  ఆ ఫైనల్లో మిరోస్లావ్ క్లోజ్ సభ్యుడిగా ఉండటం విశేషం. యాదృచ్ఛింగా బ్రెజిల్‌పైనే, వారి దేశంలోనే, రొనాల్డో సమక్షంలోనే అతని రికార్డును క్లోజ్ అధిగమించాడు. క్లోజ్ గోల్ చేస్తున్న సమయంలో రొనాల్డో స్టేడియం గ్యాలరీలో స్థానిక టెలివిజన్ కోసం వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. అత్యధిక గోల్స్ జాబితాలో గెర్డ్ ముల్లర్ (జర్మనీ-14 గోల్స్); జస్ట్ ఫోంటైన్ (ఫ్రాన్స్-13 గోల్స్); పీలే (బ్రెజిల్-12 గోల్స్) వరుసగా మూడు నుంచి ఐదు స్థానాల్లో ఉన్నారు.
 

మరిన్ని వార్తలు