ఆడినోళ్లదే అందలం

15 Jul, 2014 01:00 IST|Sakshi
ఆడినోళ్లదే అందలం

‘ఎన్నిసార్లు విఫలమైనా మరోసారి ప్రయత్నించు. ఆలస్యమైనా... లక్ష్యం తప్పకుండా సిద్ధిస్తుంది’. జర్మనీ ఫుట్‌బాల్ జట్టు దీనిని అక్షరాలా, ఆటలారా నిరూపించింది. గత మూడు ప్రపంచకప్‌లలో టైటిల్‌కు చేరువైనట్టే కనిపించినా... ఆఖరకు టాప్-3 స్థానాలతో సరిపెట్టుకుంది. అయితే నాలుగో ప్రయత్నంలో ‘సాంబా’ నేలపై జర్మనీ జిగేల్‌మంది. ఆద్యంతం స్థిరమైన ప్రదర్శనతో 24 ఏళ్లుగా ఊరిస్తున్న ప్రపంచకప్ కిరీటాన్ని హస్తగతం చేసుకుంది. ఒకరిద్దరిపై ఆధారపడితేనో, అదృష్టమో, ఎల్లవేళలా అందలం ఎక్కించలేవని... కలసికట్టుగా ఆడితేనే విజయశిఖరాన్ని అధిరోహించవచ్చని జర్మనీ బృందం చాటిచెప్పింది. థామస్ ముల్లర్, టోనీ క్రూస్, ష్వాన్‌స్టీగర్, మిరోస్లావ్ క్లోజ్, ఆండ్రీ షుర్లె, హమెల్స్, మెసుట్ ఒజిల్, సమీ ఖెడిరా, మారియో గాట్జె, గోల్‌కీపర్ నుయెర్... కోచ్ జోచిమ్ లూ... జర్మనీ విజయ సూత్రధారులుగా నిలిచారు. పాదరసంలాంటి కదలికలు... అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం... ఆటగాళ్ల మధ్య స్వార్థంలేని ఆటతీరు... కీలకదశలో ఒత్తిడికి తలొగ్గని నైజం... జర్మనీ జట్టుకు 1990 తర్వాత మరోసారి ప్రపంచకప్‌ను అందించాయి. వరుసగా నాలుగో ప్రపంచకప్ ఆడిన 35 ఏళ్ల మిరోస్లావ్ క్లోజ్ 16 గోల్స్‌తో ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన క్రీడాకారుడిగా రికార్డు సృష్టించాడు.     - సాక్షి క్రీడావిభాగం
 
గాట్జె ‘సూపర్ గోల్’

భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో ఫిలిప్ లామ్ నేతృత్వంలోని జర్మనీ 1-0 గోల్ తేడాతో చిరకాల ప్రత్యర్థి అర్జెంటీనాపై గెలిచి నాలుగోసారి విశ్వవిజేతగా నిలిచింది. 88వ నిమిషంలో మిరోస్లావ్ క్లోజ్ స్థానంలో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన మారియో గాట్జె జర్మనీ ‘హీరో’గా అవతరించాడు. అదనపు సమయంలోని 113వ నిమిషంలో 22 ఏళ్ల మారియో గాట్జె కళ్లుచెదిరేరీతిలో గోల్ చేసి జర్మనీ విజయాన్ని ఖాయం చేశాడు. ముగ్గురు డిఫెండర్లను తప్పించుకుంటూ ఎడమ వైపు నుంచి దూసుకెళ్లిన షుర్లె క్రాస్ షాట్ సంధించాడు. ‘డి’ ఏరియాలో ఈ షాట్‌ను తన ఛాతీతో అందుకున్న గాట్జె బంతిని అద్భుతంగా నియంత్రించాడు. బంతి గాల్లో ఉండగానే తన ఎడమకాలితో షాట్ కొట్టి అర్జెంటీనా గోల్‌కీపర్ రొమెరోను బోల్తా కొట్టించాడు. ఈ క్రమంలో ప్రపంచకప్ ఫైనల్స్ చరిత్రలోనే గోల్‌చేసిన తొలి సబ్‌స్టిట్యూట్ క్రీడాకారుడిగా చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత ఏడు నిమిషాలు జర్మనీ జాగ్రత్తగా ఆడి అర్జెంటీనాకు మరోసారి ‘ఏడుపే’ మిగిల్చింది. స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీపైనే ఆధారపడిన అర్జెంటీనా... ఫైనల్లో అతిజాగ్రత్తకు పోయి తగిన మూల్యం చెల్లించుకుంది.
 

మరిన్ని వార్తలు