‘ధోనికి విశ్రాంతి ఇస్తే అది చాలా పెద్ద రిస్క్‌’

26 Apr, 2019 16:32 IST|Sakshi

చెన్నై: ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనికి విశ్రాంతి ఇస్తే అది జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతుందని బ్యాటింగ్‌ కోచ్‌ మైక్‌ హస్సీ పేర్కొన్నాడు. ఒకవేళ ధోనికి విశ్రాంతి ఇస్తే మాత్రం అది చాలా పెద్ద రిస్క్‌ తీసుకోవడమేనన్నాడు.  గత వారం సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ జరిగిన మ్యాచ్‌లో ధోని విశ్రాంతి తీసుకోగా, ఆ మ్యాచ్‌లో చెన్నై ఓడిపోయింది. అయితే  ఆమ్యాచ్‌ నుంచి ధోని విశ్రాంతి తీసుకోవడానికి వెన్నునొప్పి బాధించడమేనని వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో హస్సీ స్పందించాడు.

‘ధోని అప్పుడప్పుడు వెన్ను నొప్పితో కొంత ఇబ్బంది పడుతున్నాడు. కానీ, అది అంత తీవ్రమైందేమి కాదు. ఒక్క మ్యాచ్‌ నుంచి కూడా విశ్రాంతి తీసుకోవాలనుకోవట్లేదని ధోనినే చెప్పాడు. ప్రస్తుతం ధోనీ వందశాతం ఫిట్‌గా ఉన్నాడు. అందుకే ఈ సీజన్‌లో ధోని బ్యాట్‌తోనూ బాగా రాణిస్తున్నాడు. అటు సారథిగా, ఇటు ఆటగాడిగా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ధోనికి విశ్రాంతి ఇస్తే అది జట్టుపై ప్రభావం చూపుతుంది. ఇక వాట్సన్‌ విషయంలో ధోని, ఫ్లెమింగ్‌ చూపించిన నమ్మకం చాలా గొప్పది. వరుసగా విఫలమైనా సరే వాట్సన్‌కు మళ్లీ మళ్లీ అవకాశాలు కల్పించారు. అందుకు తగ్గ ప్రతిఫలం పొందారు. ఐపీఎల్‌లాంటి లీగ్‌లో ఒక ఆటగాడికి అన్ని అవకాశాలు ఇవ్వడం సాధారణ విషయం కాదు. బ్యాట్స్‌మెన్‌ ఏ నంబర్‌లో వచ్చినా మంచి భాగస్వామ్యాలు చేయడం ముఖ్యం. అదే మేము నమ్ముతున్నాం’ అని హస్సీ పేర్కొన్నాడు.

మరిన్ని వార్తలు