ఎవరు అనేది వారే డిసైడ్‌ చేస్తారు: శుబ్‌మన్‌

13 Feb, 2020 16:15 IST|Sakshi

అది మేనేజ్‌మెంట్‌ హెడేక్‌

హామిల్టన్‌:  టీమిండియా రెగ్యులర్‌ ఓపెనర్లు శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మలు గాయాల కారణంగా న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కు అందుబాటులో లేరు. కివీస్‌తో ద్వైపాక్షిక సిరీస్‌కు ముందే ధావన్‌ గాయం కారణంగా దూరమైతే, సిరీస్‌ మధ్యలో రోహిత్‌ గాయ పడటంతో అటు టీ20 సిరీస్‌తో పాటు టెస్టు సిరీస్‌ నుంచి కూడా వైదొలిగాడు. ఈ తరణంలో కివీస్‌తో జరుగనున్న రెండు టెస్టుల సిరీస్‌లో ఎవరు ఓపెనింగ్‌కు దిగుతారనేది సమస్యగా మారింది. కివీస్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లో విశేషంగా రాణించిన కేఎల్‌ రాహుల్‌ను టెస్టు జట్టులోకి తీసుకోపోవడంతో ఓపెనింగ్‌ జంటపై కాస్త సందిగ్థత నెలకొంది. మయాంక్‌ అగర్వాల్‌తో కలిసి పృథ్వీ షా బరిలోకి దిగుతాడా.. లేక మయాంక్‌-శుబ్‌మన్‌ గిల్‌లు ఇన్నింగ్స్‌ను ఆరంభిస్తారా అనే దానిపై క్లారిటీ లేదు. 

అయితే టీ20 సిరీస్‌లో పూర్తిగా నిరాశపరిచిన మయాంక్‌ అగర్వాల్‌ను టెస్టు తుది జట్టులో కొనసాగిస్తారా.. లేదా అనే అనుమానం కూడా ఉంది. కాకపోతే మయాంక్‌కు 9 టెస్టులు ఆడిన అనుభవం ఉండటంతో అతనికే పెద్ద పీట వేయవచ్చు.  ఒకవేళ అదే జరిగితే పృథ్వీ షా-శుబ్‌మన్‌ గిల్‌లో ఎవరో ఒకరు రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితం కావచ్చు. ఇటీవల కాలంలో భారత్‌-‘ఎ’ జట్టు తరఫున గిల్‌, పృథ్వీషాలు విశేషంగా రాణించడంతో తమ స్థానాలపై ధీమాగా ఉన్నారు. ఈ క్రమంలోనే సహచర ఆటగాడు పృథ్వీ షాతో ఓపెనింగ్‌ స్థానం కోసం పోటీపై ఎదురైన ప్రశ్నకు తనదైన శైలిలో బదులిచ్చాడు శుబ్‌మన్‌ గిల్‌.

‘నాకు పృథ్వీ షాతో ఎటువంటి పోటీలేదు. మాలో ఎవరికీ అవకాశం వచ్చినా జట్టు కోసమే ఆడతాం. ఒకరితో ఒకరు పోటీ పడటం కోసం ఇక్కడి రాలేదు. వచ్చిన అవకాశాల్ని నిలబెట్టుకోసమే వచ్చాం.  తుది జట్టులో ఎవరు ఉండాలనేది మా సమస్య కాదు.. అది మేనేజ్‌మెంట్‌ హెడేక్‌. మా ఇద్దరి కెరీర్‌లో ఒకేసారి ఆరంభమై ఉండొచ్చు.. కానీ అందుకోసం మా మధ్య పోరు అనేది ఎప్పుడూ చోటు చేసుకోలేదు.. చోటు చేసుకోదు. ఇప్పటివరకూ మా స్థానాల్లో మెరుగైన ప్రదర్శన ఇవ్వడంతోనే ఇంతవరకూ వచ్చాం. భారత సీనియర్‌ జట్టు తరఫున ఎవరు ఆడతారు అనేది మేనేజ్‌మెంట్‌ చూసుకుంటుంది. ఎవరికి అవకాశం వచ్చినా అది వృథా కాకుండా ఆడటమే మా ముందున్న లక్ష్యం’ అని గిల్‌ చెప్పుకొచ్చాడు. ఈ నెల 21వ తేదీన భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య వెల్లింగ్టన్‌లో తొలి టెస్టు ఆరంభం కానుంది. అంతకుముందుగా న్యూజిలాండ్‌ ఎలెవన్‌తో భారత్‌ మూడు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడనుంది. 

మరిన్ని వార్తలు