'ఇక బౌలింగ్ చేయడం మానుకో'

18 Nov, 2017 12:24 IST|Sakshi

కరాచీ: అనుమానాస్పద బౌలింగ్ తో పదే పదే సస్పెన్షన్ కు గురువుతున్న పాకిస్తాన్ ఆల్ రౌండర్ మొహ్మద్ హఫీజ్  తన బౌలింగ్ ను వదులుకుంటేనే ఉత్తమమని ఆ దేశ దిగ్గజ క్రికెటర్ వసీం అక్రమ్ సలహా ఇచ్చాడు. ఒక మంచి బ్యాట్స్ మన్ కూడా అయిన హఫీజ్.. బౌలింగ్ గురించి ఆలోచించకుండా ఉండాలంటే దాన్ని విడిచిపెట్టడమే ఉత్తమని సూచించాడు. 'ఇక హాఫీజ్ బౌలింగ్ ను వదులుకోవాలి. అప్పుడే బ్యాటింగ్ పై మరింత ఏకాగ్రత పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. బ్యాటింగ్ పై మాత్రమే ఫోకస్ పెట్టు. హఫీజ్ బౌలింగ్ ఐసీసీ నిబంధనలకు లోబడి లేనప్పుడు దానిపై దృష్టి పెట్టడం ఎందుకు. బౌలింగ్ గురించే పదే పదే పాకులాడుతున్నాడు. అతనికి బ్యాటింగ్ కూడా ఒక ఆయుధం. అటువంటప్పుడు బౌలింగ్ ను మరిచిపో. ఆ క్రమంలోనే బ్యాటింగ్ పై మరింత ఫోకస్ చేస్తే నీ కెరీర్ కు మంచిది'అని అక్రమ్ పేర్కొన్నాడు.


కొన్ని రోజుల క్రితం హఫీజ్‌ అనుమానాస్పద బౌలింగ్‌ శైలితో మరోసారి బౌలింగ్‌కు దూరమయ్యాడు.  అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలింగ్‌ చేయడానికి అతడిని ఐసీసీ అనర్హుడిగా ప్రకటించింది. ఇటీవల అబుదాబి వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో హఫీజ్‌ బౌలింగ్‌ యాక్షన్‌పై అంపైర్లు సందేహం వ్యక్తం చేశారు. హఫీజ్‌ ఆఫ్‌స్పిన్‌ బౌలింగ్‌పై నిషేధం విధించడం ఇది మూడోసారి .2014 డిసెంబర్‌లో తొలిసారి ఐదు నెలల నిషేధం ఎదుర్కొన్న హఫీజ్‌ తర్వాత 2015 జూన్‌లో వివాదాస్పద బౌలింగ్‌ యాక్షన్‌తో నిషేధం కారణంగా 12 నెలల పాటు బౌలింగ్‌ చేయలేదు.
 

మరిన్ని వార్తలు