తప్పతాగి... సోయి తప్పి

26 Jul, 2018 00:53 IST|Sakshi

మ్యాక్స్‌వెల్‌... రాజ్‌కోట్‌  రిసార్టు రహస్యం 

అది 2017 ఐపీఎల్‌ సీజన్‌... కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌కు గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ కెప్టెన్‌! ఆ జట్టు గుజరాత్‌ లయన్స్‌తో మ్యాచ్‌ ఆడేందుకు రాజ్‌కోట్‌ వచ్చింది. ఈ సందర్భంగా గుజరాత్‌ ఫ్రాంచైజీ యాజమాన్యం ముందురోజు ఓ రిసార్టులో విందు నిర్వహించింది. ఇలాంటి చోటుకు ఆటగాళ్లు వెళ్లాలంటే జట్టు మేనేజర్, స్థానిక లైజన్‌ అధికారికి సమాచారం ఇవ్వాలి. భద్రతాధికారులు వెంట ఉండటం తప్పనిసరి. కానీ ఆస్ట్రేలియా ఆటగాడైన మ్యాక్స్‌వెల్‌ ఈ నిబంధనలేవీ పట్టించుకోలేదు. విందుకు హాజరవడమే కాక పీకలదాకా మద్యం తాగాడు. తర్వాత అర్ధరాత్రి వేళ రిసార్టులోని సైకిల్‌ వేసుకుని హోటల్‌కు తిరుగు ప్రయాణమయ్యాడు. కానీ, మత్తు కారణంగా అదుపుతప్పి రహదారి పక్కన పడిపోయాడు. వాహనాలు వేగంగా తిరిగే మార్గంలో ప్రమాదాలకు ఆస్కారం ఉన్నచోట అచేతన స్థితిలో ఉన్న అతడిని ఓ వ్యక్తి గుర్తుపట్టి... టీమ్‌ బస చేసిన హోటల్‌కు చేర్చాడు. ఈ విషయమంతా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గతేడాది ఐపీఎల్‌ సందర్భంగా ఫిక్సింగ్‌ ఆరోపణలపై తాను బీసీసీఐ ఆధ్వర్యంలోని అవినీతి నిరోధక విభాగానికి పూర్తి వివరాలు తెలిపినట్లు మ్యాక్స్‌వెల్‌ రెండు రోజుల క్రితం ప్రకటించాడు.

అయితే, రిసార్టు విందు ప్రస్తావన బయటకు రాలేదు. తాజాగా ముంబైకి చెందిన ఓ ఆంగ్ల పత్రిక దానిని బయటపెట్టింది. మద్య నిషేధం అమల్లో ఉన్న గుజరాత్‌లో జరిగిన ఈ ఘటనపై మరిన్ని సంగతులు వెల్లడించింది. వీటిని బీసీసీఐ అధికారి ఒకరు ధ్రువీకరించారు కూడా. వివాదానికి దారితీసే అవకాశం ఉన్నందున ఈ ఉదంతాన్ని బహిరంగ పర్చలేదని ఆ అధికారి తెలిపారు. బీసీసీఐ పుస్తకాల్లో మాత్రం నమోదైందని పేర్కొన్నారు. దీనిపై క్రికెట్‌ ఆస్ట్రేలియా స్పందిస్తూ... ఇతర బోర్డుల వ్యవహారాలపై తాము మాట్లాడబోమని, మీడియాలో వచ్చే ఊహాగానాలను పట్టించుకోమని ప్రకటిం చింది. 2017లో రాంచీ టెస్టు సందర్భంగా ఆస్ట్రేలియా క్రికెటర్లు ఫిక్సింగ్‌కు పాల్పడ్డారంటూ ఇటీవల అల్‌ జజీరా చానెల్‌ ఓ డాక్యుమెంటరీ ప్రసారం చేసింది. తర్వాత ఐపీఎల్‌ సమయంలోనూ ఇలాంటి అవాంఛనీయ ఘటనలపై అవినీతి నిరోధక విభాగం అధికారులకు తాను ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చానని మ్యాక్స్‌వెల్‌ చెప్పాడు. ‘రాజ్‌కోట్‌ రిసార్టు’ గురించి మాత్రం ఇప్పుడే బయటపడింది. మరోవైపు ఆ రోజు రిసార్టులో జరిగింది విందు కాదని... గెట్‌ టు గెదర్‌ పార్టీ మాత్రమేనని గుజరాత్‌ లయన్స్‌ ఫ్రాంచైజీ అధికారి ఒకరు ప్రకటించడం గమనార్హం.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా