‘ఐమ్యాక్స్’ విధ్వంసం!

9 May, 2014 01:12 IST|Sakshi
‘ఐమ్యాక్స్’ విధ్వంసం!

చెలరేగుతున్న గ్లెన్ మ్యాక్స్‌వెల్
 భారీ సిక్సర్లు, స్విచ్ హిట్‌లతో దూకుడు
 ఐపీఎల్‌పై ప్రత్యేక ముద్ర
 
 ఏదో ఒక మ్యాచ్‌లో అడ్డంగా బాదితే... సర్లే అనుకోవచ్చు. రెండు మూడు మ్యాచ్‌ల్లో విధ్వంసం సృష్టిస్తే ఫామ్‌లో ఉన్నాడులే అని ఊరుకోవచ్చు. కానీ ప్రతి మ్యాచ్‌లోనూ బౌలర్లను వణికిస్తుంటే..? ప్రపంచంలో ఏ బ్యాట్స్‌మన్‌కు అయినా ముచ్చెమటలు పట్టించే బౌలర్లను కూడా ఊచకోత కోస్తుంటే..? దీనిని ఏమనాలి..? అసలు ఆ షాట్లు చూస్తుంటే ఇది క్రికెటేనా అనే సందేహం వచ్చేలా ఆడుతున్నాడు మ్యాక్స్‌వెల్. వింత వింత షాట్లతో క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు.
 
 సాక్షి క్రీడావిభాగం
 ‘సాంప్రదాయ విరుద్ధమైన స్విచ్ హిట్‌లాంటి షాట్లపై నీ అభిప్రాయం ఏమిటి’... దాదాపు రెండేళ్ల క్రితం శ్రీలంకలో టి20 ప్రపంచ కప్ సందర్భంగా విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్‌గేల్‌కు ఎదురైన ప్రశ్న ఇది. ‘దాని గురించి ఆలోచనే లేదు. ఇంకా ఆ స్థాయికి నేను చేరుకోలేదు’ అనేది గేల్ సమాధానం.
 
  కానీ గేల్‌లాంటి ఆటగాడు కూడా ఆడేందుకు సంకోచించే షాట్లతో ఇప్పుడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ విరుచుకు పడుతున్నాడు. ఐపీఎల్-7 సగం ముగిసే సరికి ఇప్పుడు మ్యాక్సీ నామస్మరణ తప్ప మరో ఆటగాడి గురించి చర్చించే అవకాశమే లేకుండా ఈ ఆస్ట్రేలియన్ అందరి దృష్టినీ తిప్పుకున్నాడు. కంప్యూటర్ భాషలో చెప్పాలంటే  ఐపీఎల్‌కు సంబంధించి మ్యాక్స్‌వెల్‌ను ‘గేల్ అప్‌డేటెడ్ వెర్షన్’గా చెప్పవచ్చు.
 
 దూకుడే మంత్రం
 ఆస్ట్రేలియా క్రికెట్‌లో స్టార్ ఆటగాళ్లకు కొదవ లేదు. అక్కడ దేశవాళీ క్రికెట్‌లో గుర్తింపు రావాలంటే ఆటగాడు తనదైన ప్రత్యేకత ప్రదర్శించక తప్పదు. మ్యాక్స్‌వెల్ అదే చేసి చూపించాడు. అండర్-19 స్థాయినుంచే భారీ షాట్లు ఆడగలడని గుర్తింపు తెచ్చుకున్న అతనికి విక్టోరియా జట్టులో చోటు లభించింది. కొన్నాళ్లకే దేశవాళీ వన్డే మ్యాచ్‌లో 19 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించి కొత్త ఆసీస్ రికార్డు నెలకొల్పాడు.
 
 
 అంతే... ఆ తర్వాత విక్టోరియా జట్టులో మూడు ఫార్మాట్‌లలోనూ అతను పూర్తి స్థాయి సభ్యుడయ్యాడు. రెండు సీజన్ల పాటు నిలకడగా ఆడటంతో ఆసీస్ జాతీయ జట్టులోనూ చోటు దక్కింది. పేస్, స్పిన్ బౌలింగ్‌లు రెండింటినీ చక్కగా ఎదుర్కొంటున్న ఈ విక్టోరియన్... భారీ షాట్లతోనే కాకుండా జట్టు అవసరాలకు అనుగుణంగా నియంత్రణతో ఆడగల సమర్థుడు. ఆఫ్ స్పిన్‌తో పాటు అత్యుత్తమ ఫీల్డింగ్ అతని అదనపు బలాలు.
 
 బౌలర్లపై జులుం...
 రెండేళ్ల క్రితం ఐపీఎల్‌లో ఢిల్లీ తరఫున 2 మ్యాచ్‌లు, 6 పరుగులు, గత ఏడాది ముంబై తరఫున 3 మ్యాచ్‌లు, 36 పరుగులు...ఇదీ ఈ ఏడాది లీగ్ ప్రారంభానికి ముందు ఐపీఎల్‌లో మ్యాక్స్‌వెల్ రికార్డు. అలాంటి ఆటగాడు ఇప్పుడు పంజాబ్ తరఫున సింహంలా గర్జించాడు. 7 మ్యాచుల్లో 95, 89, 95, 15, 6, 45, 90 స్కోర్లు చేశాడు. స్విచ్ హిట్, రివర్స్ స్వీప్‌లాంటి షాట్లు అతనికంటే సమర్థంగా మరెవరూ వాడలేకపోతున్నారు. ఆఫ్ స్టంప్ లైన్‌లో పడి బయటికి వెళుతున్న బంతిని మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్సర్‌గా మలచడం మ్యాక్స్‌వెల్‌కే చెల్లింది. ఏదో ఒక షాట్ గుడ్డిగా బౌండరీ దాటిందన్నట్లు కాకుండా సాధికారతతో పక్కా షాట్లు ఆడుతుండటం అతని ఆత్మవిశ్వాసాన్ని చూపిస్తోంది. ఈ ఏడాది లీగ్‌లో అతని బారిన పడని బౌలర్ లేడంటే అతిశయోక్తి కాదు.
 
 భారత అత్యుత్తమ స్పిన్నర్, ధోని ట్రంప్ కార్డ్ అశ్విన్ కూడా బాధితుల్లో ఉన్నాడు. చెన్నైతో తొలి మ్యాచ్‌లో అశ్విన్ బౌలింగ్‌లో 15 బంతుల్లో 30 పరుగులు చేసిన మ్యాక్స్‌వెల్... గురువారం 9 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 34 పరుగులు రాబట్టాడు! మిశ్రా, కరణ్ శర్మ, ఫాల్క్‌నర్, మలింగ, హర్భజన్...అంతా మ్యాక్సీ బారిన పడ్డవాళ్లే. టోర్నీలో అతను ఇప్పటి వరకు 27 సిక్సర్లు బాదాడు. ఇక సెంచరీ కోసం వేగం తగ్గించే ప్రయత్నం కూడా చేయని అతను నాలుగు సార్లు శతకానికి చేరువైనా అందుకోలేకపోయాడు.
 
 టి20 కింగ్
 మ్యాక్స్‌వెల్ విధ్వంసం ఈ ఐపీఎల్‌తోనే ప్రారంభం కాలేదు. ప్రపంచ వ్యాప్తంగా 2013-14 సీజన్‌లో టి20 క్రికెట్‌లో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా గ్లెన్ నిలిచాడు. గత అక్టోబర్‌నుంచి ఆడిన 24 ఇన్నింగ్స్‌లలో అతను 853 పరుగులు చేశాడు. దాదాపు 200కు పైగా స్ట్రైక్‌రేట్‌తో అతను ఈ మొత్తం చేయడం విశేషం. ఇదే సమయంలో అతని తర్వాతి స్థానంలో చాలా దూరంలో (150 స్ట్రైక్‌రేట్) డేవిడ్ మిల్లర్ ఉండటం మ్యాక్స్ ఆధిక్యానికి నిదర్శనం. ఇందులో 9 భారీ అర్ధ సెంచరీలు ఉన్నాయి.
 
 ఐపీఎల్‌కు ముందు రెండు కీలక ఇన్నింగ్స్‌లు అతని విలువను చాటి చెప్పాయి. బిగ్‌బాష్ లీగ్‌లో స్టార్స్ తరఫున 28 బంతుల్లో 58 పరుగులు, ఇటీవల బంగ్లాదేశ్‌లో ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌పై 33 బంతుల్లో 74 పరుగులు చేశాడు. ఈ రెండు మ్యాచుల్లో ఆరేసి సిక్సర్లు కొట్టాడు. ఐపీఎల్‌తో పాటు చాంపియన్స్ లీగ్, బిగ్‌బాష్ లీగ్, ఇంగ్లండ్ టి20 కప్... ఇలా అన్ని చోట్లా అతనినుంచి మెరుపు ఇన్నింగ్స్‌లు నమోదయ్యాయి.
 
 ‘నేను ఆ తరహాలో కొంత దూకుడుగా ఆడేవాడిని. కానీ మ్యాక్స్‌వెల్ స్థాయిలో అంత విధ్వంసకర బ్యాటింగ్ మాత్రం చేయలేదు. గేల్‌కంటే కూడా అతను ప్రమాదకారి. మ్యాక్సీ తన క్రికెట్ పుస్తకం తెరిచాడంటే అది ఫోర్ లేదా సిక్స్ అవుతుంది. ఆట గురించి తనలో ఎప్పుడూ ఎలాంటి ఆందోళన ఉండదు. వెళ్లి స్వేచ్ఛగా ఆడతాడు’
 - వీరేంద్ర సెహ్వాగ్
 
 
 ‘రివర్స్‌లో అలాంటి షాట్లు ఆడాలంటే అద్భుతమైన నైపుణ్యం అవసరం. సచిన్, సెహ్వాగ్‌ల తరహాలో మ్యాక్స్‌వెల్ ప్రత్యేకమైన ఆటగాడు. ఇప్పుడు అతను తన అత్యుత్తమ ఆట ఆడుతున్నాడు’   
 - ఎం.ఎస్. ధోని
 

మరిన్ని వార్తలు