ఉద్వేగానికి గురైన మాక్స్‌వెల్‌

26 May, 2020 15:33 IST|Sakshi

మెల్‌బోర్న్‌ : ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ ఉద్వేగానికి లోనయ్యాడు. సిడ్నీలోని ఒక ఏటీఎం సెంటర్‌లో ఒక వికలాంగుడి వద్ద నుంచి ఇద్దరు దొంగలు చొరబడి దర్జాగా డబ్బులు దోచుకెళ్లడం అన్యాయమని పేర్కొన్నాడు. వివరాల్లోకి వెళితే.. ఆదివారం ఉదయం సిడ్నీలో పక్షవాతంతో వీల్‌చైర్‌కే పరిమితమైన 42 ఏళ్ల స్టువర్ట్‌ అనే వ్యక్తి డబ్బులు డ్రా చేద్దామని వచ్చాడు. అప్పటికే ఇద్దరు దొంగలు దర్జాగా ఏటీఎం సెంటర్ లోపలే కూర్చొని ఉన్నారు. మొదట స్టువర్ట్‌ డబ్బులు విత్‌డ్రా చేస్తున్న సమయంలో బయటికి వెళ్లినట్లుగా నటించారు. స్టువర్ట్‌ డబ్బులు తీసుకొని బయటకు వస్తున్న తరుణంలో ఒక వ్యక్తి వేగంగా వచ్చి చేతిలోని డబ్బులను లాక్కొని అక్కడినుంచి పారిపోయారు. అయితే నడవలేని స్థితిలో ఉన్న స్టువర్ట్‌ వారిని అడ్డుకోలేకపోయాడు.
('కోహ్లి కంటే స్మిత్‌కే రేటింగ్‌ ఎక్కువిస్తా')

'అవి నా పెన్షన్‌ డబ్బులు.. దయచేసి వాళ్లను ఎవరైనా పట్టుకోండి' అంటూ గట్టిగా అరిచాడు. స్థానికులు గమనించేలోపే ఆ ఇద్దరు అక్కడి నుంచి పారిపోయారు. 'నేను పుట్టుకతోనే పక్షవాతానికి గురయ్యాను.. ఎవరి దగ్గర చేయి చాచకుండా స్వతంత్రంగా బతుకుతున్నా. కానీ సమాజంలో ఇలాంటి వ్యక్తులు ఉండడం దురదృష్టకరం' అంటూ స్టువర్ట్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వీడియోనూ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ.. ఒక అమాయకుడిపై ఇద్దరు దొంగలు ఆ విధంగా విరుచుకుపడడం నాకు నమ్మలేకుండా ఉంది. ప్లీజ్‌.. ఆ ఇద్దరిని ఎలాగైనా పట్టుకొని తీరండి. ఇది చాలా అవమానం.. ఒక వ్యక్తిని దౌర్జన్యం చేసి డబ్బులు లాక్కోవడం దారుణం' అంటూ పేర్కొన్నాడు. ఇలా జరగడం దారుణం.. వారిని ఎలాగైనా పట్టుకోండి' అంటూ ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ డామియన్‌ మార్టిన్‌ స్పందించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మరిన్ని వార్తలు