సిరీస్‌ సమర్పయామి..

27 Feb, 2019 22:38 IST|Sakshi

సెంచరీతో చెలరేగిన మ్యాక్స్‌వెల్‌

రెండో టీ20లోనూ టీమిండియా ఘోర ఓటమి

టీ20 సిరీస్‌ చేజార్చుకున్న కోహ్లి సేన

బెంగళూరు: టీమిండియా ఓడిపోవడానికి.. ఆస్ట్రేలియా గెలవడానికి కారణం ఒకే ఒక్కడు గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌. గతకొంతకాలంగా ఫామ్‌తో తంటాలు పడుతున్న ఈ విధ్వంసకర ఆటగాడు సరైన సమయంలో తనదైన రీతిలో రెచ్చిపోయాడు. బుధవారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన నిర్ణయాత్మకమైన చివరి టీ20లో మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్‌(113 నాటౌట్‌; 55 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్లు) శతకంతో చెలరేగడంతో ఏడు వికెట్ల తేడాతో టీమిండియా ఘోర ఓటమి చవిచూసింది.

దీంతో రెండు టీ20ల సిరీస్‌ను ఆసీస్‌ 2-0 తేడాతో క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఇక తొలి టీ20లో అర్ధ సెంచరీతో రాణించి.. నిర్ణయాత్మకమైన రెండో మ్యాచ్‌లో శతక్కొట్టి కోహ్లి సేన విజయాన్ని లాకున్న ఈ విధ్వంసకర ఆటగాడికి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులు దక్కాయి. 191 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌కు.. మ్యాక్స్‌వెల్‌ శతకానికి తోడు డీఆర్సీ షార్ట్‌(40) రాణించడంతో మరో రెండు బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. మ్యాక్స్‌వెల్‌ విధ్వంసం ప్రారంభానికి ముందు 22 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి పర్యాటక జట్టు కష్టాల్లో ఉన్నట్టు కనిపించింది. అయితే మ్యాక్స్‌వెల్‌, షార్ట్‌లు సమయోచితంగా రాణించారు. చివర్లో హ్యాండ్స్‌కాంబ్‌ (20 నాటౌట్‌) తుదివరకు ఉండి జట్టుకు విజయాన్నందించాడు.  టీమిండియా బౌలర్లలో విజయ్‌ శంకర్‌కు రెండు వికెట్లు దక్కగా, సిద్దార్థ్‌ కౌల్‌కు ఓ వికెట్‌ దక్కింది. 

కోహ్లి, ధోని ధనాధన్‌
అంతకముందు టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు శుభారంభాన్నందించారు. తొలి వికెట్‌కు 61 పరుగులు జోడించిన అనంతరం రాహుల్‌(47) కౌల్టర్‌ నీల్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అనంతరం వెంటవెంటనే ధావన్‌ (14), పంత్‌(1)లు వెనుదిరిగారు. దీంతో టీమిండియా 74 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ కష్ట సమయంలో సారథి కోహ్లి (72 నాటౌట్‌; 38 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లు), ఎంఎస్‌ ధోని (40; 23 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఆసీస్‌ బౌలర్లలో కమ్మిన్స్‌, కౌల్టర్‌లు తలో రెండు వికెట్లు పడగొట్టగా.. రిచర్డ్‌ సన్‌ ఒక్క వికెట్‌ దక్కించుకున్నాడు. 

మరిన్ని వార్తలు