మను మళ్లీ మెరిసె... 

7 Mar, 2018 01:35 IST|Sakshi

 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో స్వర్ణం

గ్వాడలహారా (మెక్సికో): సీనియర్‌స్థాయిలో తాను పాల్గొంటున్న తొలి ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నమెంట్‌లో టీనేజ్‌ సంచలనం మనూ భాకర్‌ మళ్లీ అదుర్స్‌ అనిపించింది. 16 ఏళ్ల ఈ హరియాణా అమ్మాయి వరుసగా రెండో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత ఈవెంట్‌లో పసిడి పతకం నెగ్గిన మనూ... 24 గంటల్లోపే మరో స్వర్ణం సాధించింది. ఈసారి 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో భారత్‌కే చెందిన ఓంప్రకాశ్‌తో కలిసి మనూ విజేతగా నిలిచింది.

ఐదు జోడీలు పాల్గొన్న ఫైనల్లో మనూ–ఓంప్రకాశ్‌ ద్వయం 476.1 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది. సాండ్రా రీట్జ్‌–క్రిస్టియన్‌ రీట్జ్‌ (జర్మనీ–475.2 పాయింట్లు) జంట రజతం... సెలైన్‌ గొబెర్‌విలె–ఫ్లోరియన్‌ ఫౌక్వెట్‌ (ఫ్రాన్స్‌–415.1 పాయింట్లు) జోడీకి కాంస్యం లభించాయి. 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో భారత్‌కే చెందిన మెహులీ ఘోష్‌–దీపక్‌ కుమార్‌ ద్వయం కాంస్యం సాధించింది. ఫైనల్లో మెహులీ–దీపక్‌ జంట 435.1 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు ఈ టోర్నీలో భారత్‌ మూడు స్వర్ణాలు, నాలుగు కాంస్యాలతో కలిపి ఏడు పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.   

మరిన్ని వార్తలు