ఇలా అయితే తలపోటే: బుమ్రా

7 Jul, 2019 19:41 IST|Sakshi

మాంచెస్టర్‌: వరల్డ్‌కప్‌లో భారత క్రికెట్‌ జట్టు ప్రదర్శనపై పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా తనదైన శైలిలో స్పందించాడు. ప్రతీ ఒక్కరూ తమకు వచ్చిన అవకాశాల్ని వినియోగించుకుంటూ సత్తా చాటడం తుది జట్టు కూర్పు విషయంలో ఒక తలనొప్పిగా మారిపోయిందంటూ చమత్కరించాడు. ఎవరికి వారు తమ ప్రతిభను చాటుకోవడంతో శుభపరిణమం అని, అదే సమయంలో ఆటగాళ్ల మధ్య కాంపిటేషన్‌ కూడా పెరిగిపోయిందన్నాడు.

‘ప్రతీ ఒక్కరూ ఆశించిన స్థాయిలో రాణించడం మేనేజ్‌మెంట్‌కు తలనొప్పిగా మారింది. అది మంచి తలపోటే అనుకోండి. మెగా టోర్నీలో విజయాల పరంపర కొనసాగించడం మంచి పరిణామం. దాంతో తమ క్రికెటర్ల మధ్య ఆరోగ్యకరమైన పోటీ నెలకొంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో జట్టు సభ్యులు ఆకట్టుకోవడంతోనే టాప్‌లో నిలిచాం’ అని బుమ్రా పేర్కొన్నాడు. ఇక తనపై పొగడ్తలను కానీ విమర్శలను కానీ సీరియస్‌గా తీసుకోనని ఒక ప్రశ్నకు సమాధానంగా బుమ్రా బదులిచ్చాడు. కేవలం ఆటపైనే దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు ప్రణాళికలు సిద్ధం చేసుకోవడమే తనముందున్న లక్ష్యమన్నాడు. జట్టు కోసం తాను ఏమీ చేయగలనో దాని కోసం వంద శాతం శ్రమిస్తానన్నాడు. అదే సమయంలో బౌలింగ్‌ యూనిట్‌లో హార్దిక్‌ పాండ్యా, మహ్మద్‌ షమీలు కూడా నిలకడగా వికెట్లు సాధించడంతో సానుకూలంగా సాగడానికి దోహదపడుతుందన్నాడు. మంగళవారం న్యూజిలాండ్‌ జరుగనున్న తొలి సెమీ ఫైనల్లో భారత్‌ జట్టు తలపడనుంది.

మరిన్ని వార్తలు