నా కెరీర్ మలుపు తిరుగుతుంది!

7 Jan, 2014 02:31 IST|Sakshi
గాదె హనుమ విహారి

సాక్షి, హైదరాబాద్: రంజీ ట్రోఫీ 2013-14 సీజన్‌లో లీగ్ దశ పోటీలు ముగిసే సరికి హైదరాబాద్ క్రికెటర్ గాదె హనుమ విహారి తనదైన ముద్ర వేశాడు. 8 మ్యాచ్‌ల్లో 841 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. ఎప్పుడో 14 ఏళ్ల క్రితం వీవీఎస్ లక్ష్మణ్ తర్వాత ఒక హైదరాబాదీ ఈ తరహాలో నిలకడగా భారీగా పరుగులు సాధించడం ఇదే తొలిసారి. అంతే కాదు... సీజన్‌లో కనీసం 500 పరుగులు చేసిన 39 మంది ఆటగాళ్లలో అత్యధిక సగటు (93.44) కూడా విహారిదే కావడం విశేషం. తాజా ప్రదర్శనతో ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించడంతో విహారిలో ఆత్మ విశ్వాసం పెరిగింది. లక్ష్మణ్ తర్వాత హైదరాబాదీ బ్యాట్స్‌మన్‌గా భారత జట్టులో చోటు సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్న విహారి తన ఆట గురించి ‘సాక్షి’తో మాట్లాడాడు. విశేషాలు అతని మాటల్లోనే...
 రంజీ ట్రోఫీలో పరుగులు
 చాలా సంతోషంగా ఉంది. రంజీల్లో నాకిది నాలుగో సీజన్. ప్రతీ ఏడాది నా ఆట మరింత మెరుగవుతూ వచ్చింది. అదే క్రమంలో ఈసారి భారీగా పరుగులు సాధించాను. 3 సెంచరీలు, 4 అర్ధ సెంచరీలు...అందులో గత ఏడాది కొద్దిలో మిస్సయిన డబుల్ సెంచరీ ఈ సారి దక్కింది. రంజీ మ్యాచ్‌ల ఆరంభానికి ముందు తీవ్రంగా శ్రమించాను. అది ఫలితాన్నిచ్చింది. ఈ ప్రదర్శన నా కెరీర్‌ను మలుపు తిప్పుతుందని భావిస్తున్నా.
 నిలకడైన ప్రదర్శన...
 గ్రూప్ ‘సి’లో చిన్న జట్లతో ఆడటం వల్ల నా పరుగుల విలువ తగ్గుతుందని నేను భావించడం లేదు. టీమ్ గేమ్‌లో నా ఒక్కడి ప్రదర్శన ఫలితాన్ని మార్చలేదు కాబట్టి నేను ఏ జట్టులో ఉన్నానో ఆ జట్టు తరఫున అసాధారణంగా ఆడటం ముఖ్యం. ఇంకా చెప్పాలంటే మా టీమ్‌లో ఎప్పుడైనా బెస్ట్ బ్యాట్స్‌మన్‌గా నిలవాలనే నేను కోరుకుంటా. నేను నిలకడగా ఆడలేనని చాలా మంది నన్ను విమర్శించాను. అయితే అలా ఆడగల సత్తా నాలో ఉందని ఈ స్కోర్లతో నిరూపించాను.
 ఆటతీరులో మార్పులు
 ఈ ఏడాది శుభారంభమే చేసినా వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయాను. సీజన్ రెండో దశలో అలాంటి తప్పులు చేయరాదని నిర్ణయించుకున్నా. నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకోవద్దని పట్టుదలగా నిలిచాను. ఫలితంగా వరుసగా మూడు సెంచరీలు వచ్చాయి. ముఖ్యంగా గోవాతో మ్యాచ్‌లో దూకుడుగా ఆడి డబుల్‌ను చేరుకున్నా. ఎప్పుడైనా బ్యాటింగ్‌లో బేసిక్స్ నా బలమని నమ్ముతా. రాబోయే దేశవాళీ వన్డే, టి20ల్లో కూడా బాగా ఆడాలని పట్టుదలగా ఉన్నా.
 రంజీ జట్టు వైఫల్యం
 ఈసారి హైదరాబాద్ మరీ ఘోరంగా ఏమీ ఆడలేదు. మేం ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు కూడా. ఎక్కువ మంది యువకులు ఉన్నారు. ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. అయితే బ్యాటింగ్‌లో భారీ స్కోర్లు చేసినా బౌలింగ్ లోపంతో ఎక్కువ మ్యాచుల్లో గెలవలేకపోయాం. రవికిరణ్‌కు మరో బౌలర్ మద్దతు లభిస్తే బాగుండేది. వచ్చేసారి దీనిని మెరుగుపర్చుకుంటే మా జట్టు ముందుకు వెళుతుంది.
 భారత జట్టులో అవకాశాలపై
 నా పరిధిలో సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు చేయడమే నా పని. సెలక్టర్ల        
 
 ఆలోచనలు ఎలా ఉంటాయో చెప్పలేను కానీ ఇదే జోరును మరో రెండు సీజన్ల పాటు కొనసాగిస్తే ఖచ్చితంగా వారిని ఆకట్టుకోగలననే నమ్ముతున్నా. అండర్-19 ఆడినా, రంజీ ఆడినా ఏ క్రికెటర్‌కైనా అంతిమ లక్ష్యం భారత జట్టు ప్రాతినిధ్యం వహించడమే కదా.
 ఐపీఎల్ వేలం
 గత ఐపీఎల్‌లో అన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశం రావడం నిజంగా నేను ఏ మాత్రం ఊహించనిది. బహుశా నేను మానసికంగా సిద్ధంగా లేకపోవడం వల్లనేమో ఐపీఎల్‌లో ఎక్కువ మ్యాచుల్లో అంచనాలు అందుకోలేకపోయాను. ఈ సారి అలా కాదు. నేను ఇప్పుడు నిలదొక్కుకున్నా. భారీగా పరుగులు చేయడంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. వేలంలో ఏ జట్టుకు ఎంపికైనా సంతోషమే.
 ఫిక్సింగ్ వార్తలు రావడం
 అవన్నీ అర్ధం లేనివి. మా ప్రమేయం, నియంత్రణలో లేకుండా ఇలాంటి వార్త రావడం దురదృష్టకరం. నేను ఎదిగే సమయంలో వెనక్కి లాగేందుకు ఎవరో పనిగట్టుకొని రాసినట్లుంది. అయినా ఈ చిన్న విషయాలు నా స్థైర్యాన్ని, ఆటను దెబ్బ తీయలేవు. వాటి తర్వాత నేను ఎంత మంచి క్రికెట్ ఆడానో చూశారు కదా!
 అండర్-19 జట్టు ప్రదర్శన
 భారత జట్టుకు నా అభినందనలు. అందరికంటే మన జట్టు చాలా పటిష్టంగా ఉంది. మనవాళ్లు వరుసగా టోర్నీలు గెలుస్తున్నారు. నా సహచరుడు మిలింద్ బాగా ఆడుతున్నాడు. 2012లో ప్రపంచకప్ నెగ్గిన జట్టులో మాతో ఉన్న విజయ్ జోల్ ఇప్పుడు టీమ్‌ను నడిపిస్తున్నాడు. అతను మళ్లీ వరల్డ్ కప్ అందిస్తాడనే నమ్ముతున్నా.

మరిన్ని వార్తలు