ఒలింపిక్స్‌ జరగాల్సిందే

14 Jul, 2020 00:09 IST|Sakshi

కరోనాపై పోరాటానికి సంకేతంగా విశ్వక్రీడలను నిర్వహించాలి

టోక్యో గవర్నర్‌ యురికో కొయికె వ్యాఖ్య

టోక్యో: వచ్చే ఏడాది ఒలింపిక్స్‌ క్రీడలు జరుగుతాయని టోక్యో గవర్నర్‌ యురికో కొయికె చెప్పారు. జపాన్‌ భావి ప్రధానిగా అంచనాలున్న ఆమె విశ్వక్రీడలపై ఆశాభావం వ్యక్తం చేసింది. కరోనా మహమ్మారిపై ప్రపంచమంతా ఏకమై ఎదుర్కొందనే సంకేతంగా అయినా వచ్చే ఏడాది మెగా ఈవెంట్‌ జరగాల్సిందేనని అన్నారు. 2016లో తొలిసారి టోక్యో గవర్నర్‌గా ఎన్నికైన ఆమె తాజాగా రెండోసారీ గవర్నర్‌ అయింది. కరోనా సంక్షోభంపై చురుగ్గా స్పందించిన ఆమె కోవిడ్‌ కట్టడిలో ప్రజల భాగస్వామ్యమే ముఖ్యమైందని టోక్యో వాసుల్ని జాగృతం చేసింది. మొదట్లో నియంత్రణలో ఉన్నప్పటికీ ఇటీవల అక్కడ కేసులు పెరిగాయి.

ఈ మహమ్మారి గనక లేకపోతే పాత షెడ్యూల్‌ ప్రకారం అంగరంగ వైభవంగా ఈ నెలలో ఒలింపిక్స్‌ జరిగేవి. ఓ మీడియా చేసిన సర్వేలో చాలా మంది జపానీయులు ఈవెంట్‌ రద్దు లేదంటే మరో వాయిదా పడితేనే మంచిదనే అభిప్రాయపడ్డారు. దీనిపై స్పందించిన గవర్నర్‌ ‘నాకైతే విశ్వక్రీడలు జరగాలనే ఉంది. విపత్కరస్థితుల్ని అధిగమించిన మానవాళి విజయసూచికగా ఈ పోటీలు గుర్తుండిపోవాలని నేను భావిస్తున్నాను’ అని అన్నారు. అయితే వచ్చే ఏడాది పోటీల నిర్వహణ విషయమై ఎలాంటి తుదిగడువు పెట్టుకోలేదని  ఆమె  చెప్పారు.

>
మరిన్ని వార్తలు