గ్రేమ్‌ స్మిత్‌.. మరో రెండేళ్లు!

17 Apr, 2020 18:44 IST|Sakshi

కేప్‌టౌన్‌: దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు(సీఎస్‌ఏ) డైరెక్టర్‌గా కొనసాగుతున్న మాజీ కెప్టెన్‌ గ్రేమ్‌ స్మిత్‌ పదవీ కాలాన్ని మరో రెండేళ్ల పాటు పొడిగించారు. గతేడాది డిసెంబర్‌లో సీఎస్‌ఏ తాత్కాలిక డైరెక్టర్‌గా నియమించబడ్డ స్మిత్‌ను రెండేళ్ల పాటు పూర్తిస్థాయిలో కొనసాగించేందుకు క్రికెట్‌ సౌతాఫ్రికా నిర్ణయం తీసుకుంది. స్మిత్‌ను తాత్కాలిక డైరక్టర్‌గా ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌ వరకే నియమించారు. కాగా,  సీఎస్‌ఏ డైరక్టర్‌గా 2022, మార్చి నెల వరకూ స్మిత్‌ కొనసాగనున్నట్లు తాజా ప్రకటనలో తాత్కాలిక చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డాక్టర్‌ జాక్వస్‌ ఫాల్‌ తెలిపారు. ‘ స్మిత్‌ మా క్రికెట్‌కు మూలస్తంభం. దక్షిణాఫ్రికా క్రికెట్‌లో పరివర్తనకు స్మిత్‌ గేమ్‌ ప్లాన్‌ ఎంతగానో ఉపయోగపడుతోంది. (నీలాగ దేశాన్ని అమ్మేయలేదు..!)

తాత్కాలిక పదవీ కాలంలో స్మిత్ అద్భుతంగా పనిచేశాడని, మెరుగైన ప్రణాళికలతో ముందుండి నడిపించాడు.అలాగే తాత్కాలిక జాతీయ సెలెక్టర్​గా లిండా జోండి సహా అనేక వ్యూహాత్మక నియామకాలు చేపట్టాడని, అందుకే స్మిత్​కు పూర్తిస్థాయి క్రికెట్ డైరెక్టర్ బాధ్యతలు అప్పగించినట్లు జాక్వస్‌ ఫాల్‌ తెలిపాడు.  ఇక తన పదవీ కాలం పొడిగించడంపై స్మిత్‌ ఆనందం వ్యక్తం చేశాడు. తనకు పూర్తి స్థాయి స్వేచ్ఛను ఇవ్వడంతో పాటు మరో రెండేళ్లు పొడిగించడంతో రోడ్‌ మ్యాప్‌పై ప్లానింగ్‌ అనేది సులభం అవుతుంది. జాక్వస్‌ ఫాల్‌ చెప్పినట్లు నా ముందు చాలా పెద్ద బాధ్యత ఉంది. కేవలం అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్‌ను మెరుగుపరచడమే కాకుండా కిందిస్థాయి(దేశవాళీ) క్రికెట్‌ను పటిష్టం చేసుకుంటూ రావాలి’ అని స్మిత్‌ స్పష్టం చేశాడు. (ఏయ్‌ కోహ్లి.. చౌకా మార్‌!)

మరిన్ని వార్తలు