స్వదేశీ కోచ్‌లపై కేంద్రం చిన్నచూపు

12 Jul, 2020 02:52 IST|Sakshi

 ఏఐసీఎఫ్‌ మాజీ చీఫ్‌ సెలక్టర్‌ రమేశ్‌ ఆవేదన  

చెన్నై: దేశవాళీ కోచ్‌ల విషయంలో ప్రభుత్వ వైఖరి పట్ల ఆలిండియా చెస్‌ సమాఖ్య (ఏఐసీఎఫ్‌) మాజీ చీఫ్‌ సెలక్టర్, గ్రాండ్‌మాస్టర్‌ ఆర్‌బీ రమేశ్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశానికి పతకాలు అందించే క్రీడాకారులను తయారుచేసినప్పటికీ జాతీయ అవార్డుల విషయంలో స్వదేశీ కోచ్‌లను ప్రభుత్వం విస్మరిస్తోందన్నారు. ప్రస్తుతం చెస్‌లో అద్భుతాలు చేస్తోన్న ఆర్‌. ప్రజ్ఞానంద, వైశాలి, జాతీయ చాంపియన్‌ అరవింద్‌ చిదంబరం, కార్తికేయన్‌ మురళీ వంటి ఆటగాళ్లను తీర్చిదిద్దిన రమేశ్‌... భారత కోచ్‌ల జీతాల విషయంలోనూ కేంద్రం తీరును విమర్శించారు.

‘భారత కోచ్‌లు కేంద్రం అందించే అవార్డుల గురించి ఆలోచించకపోవడమే ఉత్తమం. 15 ఏళ్లలో భారత్. 34 ప్రపంచ యూత్‌ చాంపియన్‌షిప్‌ పతకాలు, 40 ఆసియా యూత్, 5 ఆసియా సీనియర్, 23 కామన్వెల్త్‌ పతకాలు, చెస్‌ ఒలింపియాడ్‌లో కాంస్యం సాధించింది. కానీ కేంద్రం నుంచి లభించిన అవార్డులు సున్నా. అసలు క్రీడా పాలసీ అనేది ఉందా? భారత జట్టు చెస్‌ కోచ్‌కు ఒక్క రోజుకు లభించే జీతమెంతో ఎవరూ ఊహించలేరు. చెప్పినా నమ్మరు కూడా! కానీ విదేశీ కోచ్‌లకు 10 రెట్లు అధికంగా చెల్లింపులు ఉంటాయి’ అని ఆయన అసహనం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు