హర్మన్‌  హరికేన్‌

10 Nov, 2018 01:10 IST|Sakshi

 కెప్టెన్‌ అద్భుత సెంచరీ

టి20 ప్రపంచకప్‌లో భారత్‌కు ఘనమైన ఆరంభం

34 పరుగులతో న్యూజిలాండ్‌ చిత్తు

ఏమి ఆ బ్యాటింగ్‌... ఏమి ఆ సిక్సర్ల జోరు... ఆ దూకుడు, ధాటిని చూసి ఆడుతోంది అమ్మాయేనా అనే సందేహం వస్తే అభిమానుల తప్పేం లేదు! పవర్‌ గేమ్‌కు కొత్త పాఠాలు చూపిస్తూ ధనా ధన్‌ షాట్లతో హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ విధ్వంసం సృష్టించిన వేళ... టి20 క్రికెట్‌లో భారత్‌ రికార్డులతో  చెలరేగి ప్రపంచకప్‌లో మెరుపు బోణీ చేసింది. న్యూజిలాండ్‌ బౌలర్లపై సునామీలా విరుచుకుపడుతూ ఏకంగా ఎనిమిది భారీ సిక్సర్లతో హర్మన్‌ చూపించిన సూపర్‌ షోను వర్ణించేందుకు మాటలు చాలవు. మహిళల టి20 క్రికెట్‌లో సెంచరీ సాధించిన తొలి భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించిన కౌర్‌... కెప్టెన్‌గా కూడా ‘ప్రీత్‌’పాత్రమైన విజయాన్ని అందుకుంది.   


ప్రొవిడెన్స్‌ (గయానా): టి20 ప్రపంచ కప్‌లో భారత జట్టుకు అదిరే ఆరంభం లభించింది. టోర్నీ తొలి మ్యాచ్‌లో పటిష్టమైన న్యూజిలాండ్‌పై అద్భుత విజయంతో భారత్‌ ప్రత్యర్థులకు సవాల్‌ విసిరింది. శుక్రవారం ఇక్కడ జరిగిన గ్రూప్‌ ‘బి’ పోరులో భారత్‌ 34 పరుగుల తేడాతో కివీస్‌ను చిత్తు చేసింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 194 పరుగుల స్కోరు సాధించింది. కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ (51 బంతుల్లో 103; 7 ఫోర్లు, 8 సిక్సర్లు) మెరుపు సెంచరీ సాధించగా... జెమీమా రోడ్రిగ్స్‌ (45 బంతుల్లో 59; 7 ఫోర్లు) సత్తా చాటింది.

వీరిద్దరు రికార్డు స్థాయిలో నాలుగో వికెట్‌కు 76 బంతుల్లోనే 134 పరుగులు జోడించడం విశేషం. అనంతరం న్యూజిలాండ్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 160 పరుగులు చేసింది. సుజీ బేట్స్‌ (50 బంతుల్లో 67; 8 ఫోర్లు) అర్ధసెంచరీ సాధించగా, కేటీ మార్టిన్‌ (25 బంతుల్లో 39; 8 ఫోర్లు) రాణించింది. భారత బౌలర్లలో హేమలత (3/26), పూనమ్‌ యాదవ్‌ (3/33) ప్రత్యర్థిని దెబ్బ తీశారు. హైదరాబాద్‌ అమ్మాయి అరుంధతి రెడ్డికి ఒక వికెట్‌ దక్కింది. టోర్నీ తదుపరి మ్యాచ్‌లో రేపు పాకిస్తాన్‌తో భారత జట్టు తలపడుతుంది.

భారీ భాగస్వామ్యం...
తొలి బంతికే తాన్యా భాటియా (9) కొట్టిన ఫోర్‌తో భారత ఇన్నింగ్స్‌ జోరుగా ప్రారంభమైంది. అదే ఓవర్లో మరో ఫోర్‌ బాదిన తర్వాత మరుసటి ఓవర్‌ తొలి బంతికే ఆమె వెనుదిరిగింది. మిడ్‌ వికెట్‌ బౌండరీ వద్ద జెన్సన్‌ అద్భుత క్యాచ్‌ అందుకోవడంతో స్మృతి మం«ధాన (2) ఆట కూడా ముగిసింది. కెరీర్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న హేమలత (7 బంతుల్లో 15; 2 ఫోర్లు) కూడా ధాటిగా ఆడే ప్రయత్నంలో వికెట్‌ సమర్పించుకుంది. ఈ దశలో జెమీమా, హర్మన్‌ జత కలిశారు. కొన్ని చూడచక్కటి బౌండరీలతో జెమీమా తన క్లాస్‌ను ప్రదర్శించింది. అయితే ఆ తర్వాత హర్మన్‌ తుఫానులా విరుచుకు పడగా... జెమీమా అండగా నిలిచింది. వీరిద్దరు కివీస్‌ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా చకచకా పరుగులు సాధించారు. ఈ క్రమంలో 39 బంతుల్లోనే జెమీమా తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకుంది. అయితే మరో భారీ షాట్‌కు ప్రయత్నించి ఆమె స్టంపౌట్‌ కావడంతో భారీ భాగస్వామ్యానికి తెర పడింది.
 
స్పిన్‌ మాయాజాలం... 
భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత స్పిన్నర్ల దెబ్బకు కివీస్‌ కుదేలైంది. స్టార్‌ బ్యాటర్‌ సుజీ బేట్స్‌ మినహా మిగతావారంతా విఫలం కావడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు. తొలి వికెట్‌కు బేట్స్, అనా పీటర్సన్‌ (14) కలిసి 52 పరుగులతో శుభారంభం అందించినా... ఆ తర్వాత కివీస్‌ దానిని కొనసాగించలేకపోయింది. 20 పరుగుల వ్యవధిలో మూడు ప్రధాన వికెట్లు కోల్పోయిన తర్వాత జట్టు కోలుకోలేకపోయింది. దూకుడుగా ఆడి 38 బంతుల్లో హాఫ్‌ సెంచరీ సాధించిన బేట్స్‌ను తెలుగమ్మాయి అరుంధతి రెడ్డి చక్కటి బంతితో ఔట్‌ చేయడంతో కివీస్‌ గెలుపు ఆశలు వదులుకుంది.  లోయర్‌ ఆర్డర్‌లో కేటీ మార్టిన్‌ పోరాడినా లాభం లేకపోయింది. 


►మహిళల టి20 ప్రపంచకప్‌లో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా భారత్‌ గుర్తింపు పొందింది. 2014లో ఐర్లాండ్‌పై ఆస్ట్రేలియా (191/4) స్కోరు తెరమరుగైంది. 
► టి20ల్లో సెంచరీ చేసిన తొలి భారతీయ మహిళా క్రికెటర్‌గా హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ రికార్డు నెలకొల్పింది. ఇప్పటిదాకా భారత్‌ తరఫున మిథాలీ (97 నాటౌట్‌) పేరిట ఉన్న అత్యధిక వ్యక్తిగత స్కోరును హర్మన్‌ దాటింది.  
►హర్మన్‌ ప్రీత్‌ కౌర్, జెమీమా రోడ్రిగ్స్‌ టి20ల్లో భారత్‌ తరఫున ఏ వికెట్‌కైనా అత్యుత్తమ భాగస్వామ్యం నెలకొల్పారు.
►టి20 ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 8 సిక్స్‌లు కొట్టిన భారతీయ మహిళా క్రికెటర్‌గా హర్మన్‌ నిలిచింది. విండీస్‌ క్రికెటర్‌ డిండ్రా డాటిన్‌ 2010లో దక్షిణాఫ్రికాపై 9 సిక్స్‌లు కొట్టింది. 
►అంతర్జాతీయ టి20ల్లో సెంచరీ చేసిన ఎనిమిదో మహిళా క్రికెటర్‌ హర్మన్‌ప్రీత్‌. గతంలో డానియెలా వ్యాట్‌ (ఇంగ్లండ్‌), డాటిన్‌ (వెస్టిండీస్‌), లానింగ్‌ (ఆస్ట్రేలియా), సుజీ బేట్స్‌ (న్యూజిలాండ్‌), బెథానీ మూనీ (ఆస్ట్రేలియా), షాండ్రీ ఫ్రిట్జ్‌ (దక్షిణాఫ్రికా), టామ్సిన్‌ బ్యూమోంట్‌ (ఇంగ్లండ్‌) ఈ ఘనత సాధించారు.   


హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ మెరుపు సెంచరీ
పరుగులు 103 
బంతులు 51
ఫోర్లు 7
సిక్స్‌లు 8
స్ట్రయిక్‌ రేట్‌  201.96 

>
మరిన్ని వార్తలు