‘క్రికెట్‌లోనూ అంతే.. వీటిని ఆపడం చాలా కష్టం’

24 Sep, 2019 10:05 IST|Sakshi

న్యూఢిల్లీ: క్రికెట్‌ నుంచి మ్యాచ్‌ ఫిక్సింగ్‌ను పూర్తిగా తొలగించడం సాధ్యం కాదని భారత దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌ అభిప్రాయపడ్డారు. అత్యాశకు ఎలాంటి మందు ఉండదని ఆయన అన్నారు. ‘ఎంతటి పెద్ద చదువులు చదివినా, సరైన మార్గనిర్దేశం ఉన్నా సరే చాలా మందిలో సహజంగానే అత్యాశ ఉంటుంది. ఉన్నత స్థాయి కుటుంబాల్లోనూ ఎక్కడో ఒక చోట నేరస్తులు కనిపిస్తారు. అలాంటి వారిని ఎవరూ మార్చలేరు. క్రికెట్‌లోనూ అంతే. వీటిని ఆపడం చాలా కష్టం’ అని మాజీ కెప్టెన్‌ వ్యాఖ్యానించారు. 

తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌(టీఎన్‌పీఎల్‌), కర్ణాటక ప్రీమియర్‌ లీగ్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఇప్పుడు దానిపై విచారణ జరుగుతుంది.  దీనిలో భాగంగా స్పందించిన గావస్కర్‌.. కచ్చితంగా ప్రతీ మనిషికి అత్యాశ ఉంటుందని, ఆ క్రమంలోనే మ్యాచ్‌ ఫిక్సింగ్‌లు జరుగుతాయన్నాడు. ఇక్కడ ధనిక, పేద అనే తేడా ఉండదన్నాడు. ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన క్రికెటర్‌కు ఎక్కువ మొత్తంలో ఆశ చూపెడితే అది అతన్ని తప్పు చేసేందుకు ప్రేరేపిస్తుందన్నాడు. దాంతో ఫిక్సింగ్‌ అనే మహమ్మారిని పూర్తిగా నివారించడం సాధ్యం కాదని పేర్కొ‍న్నాడు.

మరిన్ని వార్తలు