జీఎస్‌ లక్ష్మి మరో ఘనత

13 Feb, 2020 08:12 IST|Sakshi

దుబాయ్‌ : గతేడాది డిసెంబర్‌లో పురుషుల అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌కు రిఫరీగా వ్యవహరించిన తొలి మహిళగా గుర్తింపు పొందిన ఆంధ్రప్రదేశ్‌ మాజీ క్రికెటర్‌ గండికోట సర్వ (జీఎస్‌) లక్ష్మి మరో ఘనతను సాధించనున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) ప్రపంచ స్థాయి టోర్నీలో తొలి మహిళా మ్యాచ్‌ రిఫరీగా ఆమె వ్యవహరించనున్నారు. రాజమండ్రికి (రాజమహేంద్రవరం) చెందిన 51 ఏళ్ల జీఎస్‌ లక్ష్మి ఈనెల 21న ఆస్ట్రేలియాలో మొదలుకానున్న మహిళల టి20 వరల్డ్‌ కప్‌లో మ్యాచ్‌ రిఫరీగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఈ మెగా టోర్నీకి మ్యాచ్‌ రిఫరీలుగా వ్యవహరించే ముగ్గురిలో ఏకైక మహిళ జీఎస్‌ లక్ష్మినే కావడం విశేషం.

లక్ష్మితోపాటు స్టీవ్‌ బెర్నార్డ్, క్రిస్‌ బ్రాడ్‌లను మ్యాచ్‌ రిఫరీలుగా ఐసీసీ నియమించింది. మ్యాచ్‌ అంపైర్లుగా 12 మందిని నియమించగా అందులో ఐదుగురు మహిళలకు (లారెన్‌ అగెన్‌బాగ్, కిమ్‌ కాటన్, క్లెయిరీ పొలోసక్, స్యు రెడ్‌ఫెర్న్, జాక్వెలైన్‌ విలియమ్స్‌) చోటు దక్కింది. ఏడుగురు పురుష అంపైర్లలో భారత్‌ నుంచి నితిన్‌ మీనన్‌కు మాత్రమే అవకాశం లభించింది. లీగ్‌ మ్యాచ్‌లు ముగిశాకే సెమీఫైనల్స్, ఫైనల్‌ మ్యాచ్‌లకు ఎవరు అంపైరింగ్‌ చేస్తారో ప్రకటిస్తారు. అంతర్జాతీయ మహిళల దినోత్సవం మార్చి 8న మెల్‌బోర్న్‌ స్టేడియంలో జరిగే ఫైనల్‌తో టి20 వరల్డ్‌ కప్‌ ముగుస్తుంది.    

మరిన్ని వార్తలు