సమష్టి వైఫల్యంతో అప్పగించేశారు

13 Dec, 2019 10:10 IST|Sakshi

8 వికెట్లతో హైదరాబాద్‌పై గుజరాత్‌ ఘన విజయం

ప్రియాంక్‌ పాంచల్‌ అద్భుత ఇన్నింగ్స్‌  

రంజీ ట్రోఫీ క్రికెట్‌ టోర్నీ  

సాక్షి, హైదరాబాద్‌: రంజీ ట్రోఫీ సీజన్‌ను గెలుపుతో ఆరంభించాలనుకున్న హైదరాబాద్‌ ఆశలు ఆవిరయ్యాయి. దేశవాళీ టోర్నీలో పటిష్ట గుజరాత్‌ ముందు మనోళ్ల ఆటలు సాగలేదు. కాస్త కష్టపడితే ‘డ్రా’తో సరిపెట్టుకునే వీలున్నా... మొదట బ్యాట్స్‌మెన్‌ అనంతరం బౌలర్లు సమష్టిగా విఫలమై మ్యాచ్‌ను ప్రత్యర్థికి అప్పగించారు. గురువారం గుజరాత్‌తో ముగిసిన గ్రూప్‌ ‘ఎ’ లీగ్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ 8 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఓవర్‌నైట్‌ స్కోరు 239/6తో ఆట చివరి రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన హైదరాబాద్‌ కేవలం 27 పరుగులే జోడించి మిగతా 4 వికెట్లను కోల్పోయింది.

రూశ్‌ కలారియా 5 వికెట్లతో చెలరేగగా... చింతన్‌ గాజా, అక్షర్‌ పటేల్‌ చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు. గుజరాత్‌ రెండో ఇన్నింగ్స్‌లో వేగంగా ఆడి 36.4 ఓవర్లలోనే 2 వికెట్లకు 187 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్‌ ప్రియాంక్‌ పాంచల్‌ (80 బంతుల్లో 90; 14 ఫోర్లు, 2 సిక్సర్లు), భార్గవ్‌ మెరాయ్‌ (99 బంతుల్లో 69; 6 ఫోర్లు, 1 సిక్స్‌) రెండో వికెట్‌కు 135 పరుగుల్ని జోడించి తమ జట్టుకు విజయాన్ని అందించారు. ఈనెల 17 నుంచి పాటియాలాలో జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో పంజాబ్‌తో హైదరాబాద్‌ ఆడుతుంది.  

టపాటపా...
చివరిదైన నాలుగో రోజు ఆటలో హైదరాబాద్‌ పూర్తిగా గుజరాత్‌ జట్టుకు తలొంచింది. తొలి సెషన్‌ పట్టుదలగా ఆడి గుజరాత్‌కు కష్టసాధ్యమైన లక్ష్యాన్ని నిర్దేశించి ఉంటే కనీసం మ్యాచ్‌ ‘డ్రా’ దిశగా సాగేది. కానీ లోయరార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఓవర్‌నైట్‌ బ్యాట్స్‌మెన్‌ సుమంత్‌ (17) గాజా బౌలింగ్‌లో అవుట్‌ కాగా... తనయ్‌ త్యాగరాజన్‌ (14), మెహదీ హసన్‌ (11), సిరాజ్‌ (0), మిలింద్‌ (10)లను కలారియా తన బుట్టలో వేసుకున్నాడు. దీంతో హైదరాబాద్‌ 266 పరుగులకే ఆలౌటై ప్రత్యర్థికి 187 పరుగుల లక్ష్యాన్ని విధించింది.  

అద్భుత భాగస్వామ్యం...
స్వల్ప లక్ష్యఛేదనలో గుజరాత్‌ దూసుకుపోయింది. ఓపెనర్‌ కథన్‌ పటేల్‌ (1)మ్యాచ్‌ ఆరంభంలోనే పెవిలియన్‌ చేరినా... గుజరాత్‌ వెనకడుగు వేయలేదు. వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ భార్గవ్‌ అండతో కెపె్టన్‌ ప్రియాంక్‌ పాంచల్‌ దూకుడుగా ఆడాడు. వీరిద్దరూ క్రీజులో పాతుకుపోవడంతో లంచ్‌ విరామానికి గుజరాత్‌ 99/1తో పటిష్ట స్థితిలో నిలిచింది. మరోవైపు వికెట్లు తీయడంలో హైదరాబాద్‌ బౌలర్లు విఫలమవ్వడంతో గుజరాత్‌ లక్ష్యం వైపు వడివడిగా సాగింది. జట్టు స్కోరు 144 వద్ద ప్రియాంక్‌ పాంచల్‌ ఔటైనప్పటికీ ధ్రువ్‌ రవళ్‌ (23 నాటౌట్‌) జోడీగా భార్గవ్‌ జట్టును గెలిపించాడు.  

స్కోరు వివరాలు
హైదరాబాద్‌ తొలి ఇన్నింగ్స్‌: 233; గుజరాత్‌ తొలి ఇన్నింగ్స్‌: 313; హైదరాబాద్‌ రెండో ఇన్నింగ్స్‌: తన్మయ్‌ అగర్వాల్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) అక్షర్‌ పటేల్‌ 96; అక్షత్‌ రెడ్డి (బి) అక్షర్‌ పటేల్‌ 45; శశిధర్‌ రెడ్డి (సి) మన్‌ప్రీత్‌ జునేజా (బి) రూశ్‌ కలారియా 9; సందీప్‌ (బి) అర్జాన్‌ 41; హిమాలయ్‌ (సి) ప్రియాంక్‌ (బి) చింతన్‌ గాజా 9; సుమంత్‌ (సి) మన్‌ప్రీత్‌ జునేజా (బి) చింతన్‌ గాజా 17; మిలింద్‌ (సి) ధ్రువ్‌ (బి) రూశ్‌ 10; తనయ్‌ (బి) రూశ్‌ కలారియా 14; మెహదీ హసన్‌ (సి) అక్షర్‌ పటేల్‌ (బి) రూశ్‌ కలారియా 11; సిరాజ్‌ (సి) అర్జాన్‌ (బి) రూశ్‌ కలారియా 0; రవికిరణ్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (90.1 ఓవర్లలో ఆలౌట్‌) 266. వికెట్ల పతనం: 1–80, 2–123, 3–182, 4–204, 5–204, 6–216, 7–243, 8–255, 9–263, 10–266. బౌలింగ్‌: రూశ్‌ కలారియా 16.1–3–45–5, చింతన్‌ గాజా 16–3–38–2, అర్జాన్‌ 13–3–35–1, అక్షర్‌ పటేల్‌ 23–3–44–2, రుజుల్‌ భట్‌ 9–1–34–0, పీయూశ్‌ చావ్లా 13–1–61–0.  

గుజరాత్‌ రెండో ఇన్నింగ్స్‌: కథన్‌ పటేల్‌ (సి) సుమంత్‌ (బి) రవికిరణ్‌ 1; ప్రియాంక్‌ (సి) తనయ్‌ (బి) మెహదీ హసన్‌ 90; భార్గవ్‌ (నాటౌట్‌) 69; ధ్రువ్‌ రవళ్‌ (నాటౌట్‌) 23; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (36.4 ఓవర్లలో 2 వికెట్లకు) 187. వికెట్ల పతనం: 1–9, 2–144. బౌలింగ్‌: సిరాజ్‌ 4–1–23–0, రవికిరణ్‌ 5–1–12–1, మిలింద్‌ 6–0–27–0, మెహదీ హసన్‌ 12–0–65–1, తనయ్‌ త్యాగరాజన్‌ 9.4–0–56–0.  

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా