మోరిస్ మోతెక్కించినా...

28 Apr, 2016 00:50 IST|Sakshi
మోరిస్ మోతెక్కించినా...

లయన్స్ చేతిలో ఒక్క పరుగుతో ఓడిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ 
రాణించిన మెకల్లమ్, స్మిత్

 
న్యూఢిల్లీ: ఐపీఎల్ ఆరంభం నుంచి భారీ లక్ష్యాలను ఛేదించడంలో తమ ప్రతిభ చూపెడుతున్న గుజరాత్ లయన్స్ తొలిసారి దాన్ని కాపాడుకోవడంలో నైపుణ్యం ప్రదర్శించింది. ప్రత్యర్థులు వీరోచిత పోరాటం చేసినా... ఆఖర్లో తెలివైన బౌలింగ్‌తో గట్టెక్కింది. దీంతో బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో లయన్స్ 1 పరుగు తేడాతో ఢిల్లీ డేర్‌డేవిల్స్‌పై నెగ్గింది. ఫిరోజ్ షా కోట్లా మైదానంలో... టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 172 పరుగులు చేసింది. మెలక్లమ్ (36 బంతుల్లో 60; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), డ్వేన్ స్మిత్ (30 బంతుల్లో 53; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) దుమ్మురేపారు. తర్వాత ఢిల్లీ 20 ఓవర్లలో 5 వికెట్లకు 171 పరుగులు చేసింది. క్రిస్ మోరిస్ (32 బంతుల్లో 82 నాటౌట్; 4 ఫోర్లు, 8 సిక్సర్లు), డుమిని (43 బంతుల్లో 48; 3 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగి ఆడినా ఢిల్లీని గెలిపించలేకపోయారు. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచిన మోరిస్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం దక్కింది.


 సూపర్ బౌలింగ్...
ఓపెనర్లు మెకల్లమ్, స్మిత్‌లు ఇచ్చిన మెరుపు ఆరంభాన్ని చూస్తే గుజరాత్ స్కోరు రెండొందలు దాటాలి. కానీ మధ్యలో ఢిల్లీ బౌలర్లు క్రిస్ మోరిస్ (2/35), తాహిర్ (3/24) ఇన్నింగ్స్‌ను అద్భుతంగా కట్టడి చేశారు. తొలి ఓవర్‌లో నాలుగు ఫోర్లు, ఆ తర్వాత ఓ సిక్స్‌తో రెండు ఓవర్లలోనే స్మిత్ 28 పరుగులు చేస్తే, మెకల్లమ్ రెండు భారీ సిక్సర్లు బాదడంతో లయన్స్ 3.5 ఓవర్లలోనే 50 పరుగులు చేసింది. తర్వాత కూడా వీళ్ల జోరు తగ్గకపోవడంతో పవర్‌ప్లేలో 71 పరుగులకు చేరింది. ఈ దశలో మెకల్లమ్ మళ్లీ బౌండరీలతో పూనకం వచ్చినట్లు చెలరేగాడు. ఫలితంగా 11 రన్‌రేట్‌తో తొలి 10 ఓవర్లలో గుజరాత్ 110 పరుగులు చేసింది.

అయితే 11వ ఓవర్‌లో స్మిత్ అవుట్ కావడంతో తొలి వికెట్‌కు 112 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక ఇక్కడి నుంచి ఢిల్లీ బౌలర్లు చెలరేగిపోయారు. 12వ ఓవర్‌లో 4 బంతుల తేడాలో మెకల్లమ్, రైనా (2) అవుటైతే, కొద్దిసేపటికి జడేజా (4) కూడా వెనుదిరిగాడు. ఓవరాల్‌గా ఐదు ఓవర్లలో కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టారు. 17వ ఓవర్‌లో వరుస బంతుల్లో ఇషాన్ కిషన్ (2), దినేశ్ కార్తీక్ (17 బంతుల్లో 19; 1 ఫోర్, 1 సిక్స్)లు పెవిలియన్‌కు వెళ్లగా, ఆఖర్లో బ్రేవో (7 నాటౌట్), ఫాల్క్‌నర్ (13 బంతుల్లో 22 నాటౌట్; 2 ఫోర్లు) ఏడో వికెట్‌కు 19 బంతుల్లో అజేయంగా 30 పరుగులు జత చేశారు.

 
‘టాప్’ లేపాడు...
భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీకి ధవల్ కులకర్ణి ఊహించని షాకిచ్చాడు. తన తొలి రెండు ఓవర్లలో శామ్సన్ (1), డికాక్ (5), కరుణ్ నాయర్ (9)లను అవుట్ చేయడంతో జహీర్ సేన 16 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో డుమిని, రిషబ్ పంత్ (17 బంతుల్లో 20; 2 ఫోర్లు) వికెట్లు కాపాడుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వడంతో రన్‌రేట్ పూర్తిగా మందగించింది. సింగిల్స్‌కే పరిమితం కావడంతో పవర్‌ప్లేలో 22/3 ఉన్న స్కోరు 10 ఓవర్లు ముగిసేసరికి 51 పరుగులకు మాత్రమే చేరింది. ఇక 11వ ఓవర్‌లో రిషబ్ అవుట్ కావడంతో నాలుగో వికెట్‌కు 41 పరుగుల భాగస్వామానికి తెరపడింది.


మోరిస్ మోత...
మోరిస్ క్రీజులోకి వచ్చే సమయానికి ఢిల్లీ స్కోరు 58/4. ఇక గెలవాలంటే 54 బంతుల్లో 115 పరుగులు చేయాలి. ఈ దశలో డేర్‌డెవిల్స్ విజయం దాదాపు అసాధ్యమనుకున్న పరిస్థితుల్లో మోరిస్ భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. రెండో ఎండ్‌లో డుమిని కూడా భారీ షాట్లు ఆడటంతో నాలుగు ఓవర్లలోనే (12 నుంచి 15 వరకు) 58 పరుగులు సమకూరాయి. 16వ ఓవర్‌లో ధవల్ 7 పరుగులే ఇచ్చినా..17వ ఓవర్‌లో మోరిస్ హ్యాట్రిక్ సిక్సర్లతో 21 పరుగులు రాబట్టాడు. ఇక 18 బంతుల్లో 29 పరుగులు చేయాల్సిన దశలో డుమినిని అవుట్ చేసి బ్రేవో, ప్రవీణ్ పరుగులు నిరోధించారు. దీంతో ఆఖరి ఓవర్‌లో విజయానికి 14 పరుగులు అవసరమైన దశలో బ్రేవో 12 పరుగులు మాత్రమే ఇవ్వడంతో లయన్స్ గట్టెక్కింది. డుమిని, మోరిస్ ఐదో వికెట్‌కు 6.3 ఓవర్లలో 87 పరుగులు జత చేశారు.

 స్కోరు వివరాలు
గుజరాత్ లయన్స్ ఇన్నింగ్స్: స్మిత్ ఎల్బీడబ్ల్యు (బి) తాహిర్ 53; మెకల్లమ్ (బి) మోరిస్ 60; రైనా (సి) నాయర్ (బి) మోరిస్ 2; దినేశ్ కార్తీక్ (సి) డుమిని (బి) తాహిర్ 19; జడేజా (సి) డికాక్ (బి) డుమిని 4; ఇషాన్ కిషన్ (సి) డుమిని (బి) తాహిర్ 2; బ్రేవో నాటౌట్ 7; ఫాల్క్‌నర్ నాటౌట్ 22; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 172.

 వికెట్ల పతనం: 1-112; 2-116; 3-117; 4-130; 5-142; 6-142.

బౌలింగ్: జహీర్ 4-0-48-0; నదీమ్ 4-0-32-0; మోరిస్ 4-0-35-2; మిశ్రా 3-0-27-0; తాహిర్ 4-0-24-3; డుమిని 1-0-4-1.

ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: డికాక్ (సి) రైనా (బి) ధవల్ 5; శామ్సన్ (సి) ఫాల్క్‌నర్ (బి) ధవల్ 1; కరుణ్ నాయర్ (సి) తాంబే (బి) ధవల్ 9; డుమిని (సి అండ్ బి) బ్రేవో 48; రిషబ్ పంత్ (సి) ప్రవీణ్ (బి) ఫాల్క్‌నర్ 20; మోరిస్ నాటౌట్ 82; నేగి నాటౌట్ 3; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 171.

వికెట్ల పతనం: 1-2; 2-12; 3-16; 4-57; 5-144.
బౌలింగ్: ప్రవీణ్ 4-0-13-0; ధవల్ 4-1-19-3; బ్రేవో 4-0-40-1; రైనా 2-0-17-0; స్మిత్ 2-0-26-0; ఫాల్క్‌నర్ 2-0-23-1; జడేజా 1-0-14-0; తాంబే 1-0-17-0.
 
 
1  ఐపీఎల్ చరిత్రలో ఓ మ్యాచ్‌లో జట్టు కోల్పోయిన ఆరు వికెట్లను విదేశీ బౌలర్లే తీసుకోవడం ఇదే తొలిసారి.
 
3  ఇప్పటివరకు ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌పై నమోదైన ఓపెనింగ్ జోడీ సెంచరీ భాగస్వామ్యాల సంఖ్య.
 
18  ఈ మ్యాచ్ తొలి ఓవర్‌లో జహీర్ ఇచ్చిన పరుగులు. ఈ ఐపీఎల్‌లో ఓపెనింగ్ బౌలర్ సమర్పించుకున్న అత్యధిక పరుగులివే.

>
మరిన్ని వార్తలు