ఓపెనర్గా వరల్డ్ రికార్డు..

27 Dec, 2016 17:00 IST|Sakshi
ఓపెనర్గా వరల్డ్ రికార్డు..

న్యూఢిల్లీ:రంజీ ట్రోఫీలో వరల్డ్ రికార్డు నమోదైంది. గుజరాత్ ఓపెనర్ సమిత్ గోయెల్ విశ్వరూపం ప్రదర్శించి వరల్డ్ రికార్డు నమోదు చేశాడు. ఒడిశాతో జరిగిన మూడో క్వార్టర్ ఫైనల్లో సమిత్ ట్రిపుల్ సెంచరీతో రికార్డులెక్కాడు. 723 బంతుల్లో 45 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 359 పరుగులతో అజేయంగా నిలిచాడు. దాంతో ఓపెనర్ గా 117 ఏళ్ల వరల్డ్ రికార్డును బద్ధలు కొట్టాడు. అంతకుముందు 1899 లో ఓవల్ లో సర్రే ఆటగాడు బాబీ అబెల్  నమోదు చేసిన 357 పరుగులే ఇప్పటివరకూ ఓపెనర్గా అత్యధిక వ్యక్తిగత స్కోరు.


గుజరాత్ రెండో ఇన్నింగ్స్ లో భాగంగా సమిత్ 964 నిమిషాల పాటు క్రీజ్లో నిల్చుని ఈ రికార్డు సాధించాడు. చివరి రోజు ఆటలో భాగంగా మంగళవారం 261 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ ఆరంభించిన సమిత్ ఆద్యంతం సమయోచితంగా ఆడాడు. సుమారు 180 పరుగులను ఫోర్ల రూపంలో  సమిత్ సాధించడం ఇక్కడ విశేషం.  సమిత్ గోయెల్ ట్రిపుల్ తో గుజరాత్ 227.4 ఓవర్లలో 641 పరుగులు చేసింది. దాంతో గుజరాత్ 706 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే ఆఖరి రోజు ఆట ముగిసే సమయానికి ఒడిశా వికెట్ నష్టానికి 81 పరుగులు చేయడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.

మరిన్ని వార్తలు