గల్లీ కుర్రోడు.. దుమ్మురేపాడు

6 Jul, 2018 13:16 IST|Sakshi
సాధించిన పతకాలతో విద్యార్థి షేక్‌ సాంబయ్య

ఇండో నేపాల్‌ క్రికెట్‌ సిరీస్‌కు పొన్నెకల్లు కుర్రోడు ఎంపిక

అండర్‌–19 విభాగంలో భారత జట్టు తరఫున స్థానం

ఇప్పటికే అనేక పతకాలు కైవసం చేసుకున్న సాంబయ్య

ఎక్కడో మారుమూల గల్లీలో బ్యాట్, బాల్‌తో క్రికెట్‌లో ఓనమాలు దిద్దిన పేదింటి కుర్రోడు అండర్‌–19 జట్టు తలుపు తట్టాడు.    అంచెలంచెలుగా ప్రతిభకు పదును పెట్టుకుంటూ సెలెక్టర్ల దృష్టికి తనవైపు తిప్పుకున్నాడు. బ్యాట్స్‌మన్‌ను బెంబేలెత్తించే బంతులు విసురుతూ.. అంతే వేగంగా రంజీ జట్టు వైపు దూసుకెళ్లాడు. ఇప్పటికే అనేక పతకాల పంట పండించి నేపాల్‌లో తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. అతడే తాడికొండ మండలం పొన్నెకల్లుకు చెందిన సాంబయ్య.

పొన్నెకల్లు(తాడికొండ): మండలంలోని పొన్నెకల్లు గ్రామానికి చెందిన యువకుడు షేక్‌ సాంబయ్య అండర్‌– 19 విభాగంలో భారత జట్టు తరఫున బరిలో దిగేందుకు అరుదైన అవకాశాన్ని చేజిక్కించుకున్నాడు. తండ్రి షేక్‌ సర్దార్‌ వృత్తిరీత్యా నవారు వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పొన్నెకల్లు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో చదువుకుంటూ తనలోని ప్రతిభకు మెరుగులు దిద్దుకుంటున్న విద్యార్థికి జిల్లా స్థాయిలో పాల్గొనే అవకాశం లభించింది. అవకాశాన్ని ఒడిసిపట్టుకొని తనలోని టాలెంట్‌ను నిరూపించుకోవడంతో బౌలర్‌గా మంచి ప్రతిభ కనబరుస్తూ జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉత్తమంగా రాణించడంతో సాంబయ్యకు ఈ అరుదైన అవకాశం లభించింది. ఈ నెల 16వ తేదీన నేపాల్‌లో జరిగే ఇండో నేపాల్‌ సిరీస్‌లో విద్యార్థి పాల్గొనేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సిరీస్‌లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్‌ నుంచి మొత్తం 4 మంది విద్యార్థులు ఎంపిక కాగా అందులో సాంబయ్య కూడా ఉండటం విశేషం.

గతంలో సాధించిన విజయాలివే..
2016 జూన్‌ 14న అండర్‌–16 విభాగంలో జిల్లా జట్టు తరఫున జిల్లా చాంపియన్‌షిప్‌ పోటీలలో పశ్చిమ గోదావరి జట్టుపై 3 వికెట్లు తీసి మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ సాధించాడు.
2016 జూన్‌ కడపలో జరిగిన జిల్లా చాంపియన్‌ షిప్‌ పోటీలలో 2 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.
2017 ఆగస్టు కోల్‌కత్తాలో జరిగిన మ్యాచ్‌లో విదర్భ జట్టుపై నాలుగు వికెట్లు పడగొట్టాడు.  

కోచ్‌ల సహకారంతోనే..
నాలో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన కోచ్‌లు అనీల్, మస్తాన్‌ రెడ్డి, బాల కిషోర్‌ చౌదరిలు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో ఉత్తమ శిక్షణ ఇచ్చారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరచాలనే లక్ష్యం. ఈ నెల 16వ తేదీన నేపాల్‌లో జరిగే టోర్నీకి సిద్ధమవుతున్నాను.– షేక్‌ సాంబయ్య, పొన్నెకల్లు.

మరిన్ని వార్తలు