చివరి వన్డేకు గప్టిల్‌ దూరం?

2 Feb, 2019 10:48 IST|Sakshi

వెల్లింగ్టన్‌: భారత్‌తో జరుగనున్న చివరిదైన ఐదో వన్డేకు న్యూజిలాండ్‌ స్టార్‌ ఆటగాడు మార్టిన్‌ గప్టిల్‌ దూరమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. వెన్నుముక గాయంతో బాధపడుతున్న గప్టిల్‌ ఐదో వన్డే నుంచి వైదొలగడం దాదాపు ఖాయమైంది. అతని స్థానంలో కొలిన్‌ మున్రో తిరిగి తుది జట్టులో ఆడే అవకాశం ఉంది. భారత్‌తో సిరీస్‌లో గప్టిల్‌ ఇప్పటివరకూ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. గత నాలుగు వన్డేల్లో అతను చేసిన పరుగులు 47. భారత్‌తో నాలుగో వన్డేలో గప్టిల్‌ సిక్సర్‌, రెండు ఫోర్లతో దూకుడు మీద కనిపించనప్పటికీ 14 పరుగులే చేశాడు. ఒకవేళ గప్టిల్‌ ఐదో వన్డేకు దూరమైన పక్షంలో మరో ఓపెనింగ్ జోడిని కివీస్‌ పరీక్షించడానికి సమాయత్తం కావాలి. ఇప్పటికే నికోలస్‌ను ఓపెనర్‌గా పంపి కివీస్‌ ప్రయోగం చేసిన సంగతి తెలిసిందే.

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను ఇప‍్పటికే భారత్‌ కైవసం చేసుకుంది. వరుస మూడు వన్డేల్లో విజయం సాధించిన టీమిండియా.. నాల్గో వన్డేలో ఘోర ఓటమి పాలైంది. ఇక చివరి వన్డేలో విజయం సాధించాలనే పట్టుదలతో భారత్‌ జట్టు ఉంది. ఈ సిరీస్‌ను 4-1తో భారత్ గెలిస్తే కొత్త రికార్డును సృష్టించనుంది. న్యూజిలాండ్‌లో నాలుగు  వన్డేలను గెలిచిన చరిత‍్ర భారత్‌కు లేదు. దాంతో తుది వన్డేలో గెలిస్తే భారత్‌ జట్టు కొత్త అధ్యాయాన్ని లిఖిస్తుంది. అదే సమయంలో కివీస్‌ కూడా ఆఖరి వన్డేను ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోకూడదనే యోచనలో ఉంది. ఈ తరుణంలో ఇరు జట్ల మధ్య ఆసక్తికర పోరు ఖాయం. రేపు(ఆదివారం) వెల్లింగ్టన్‌ వేదికగా ఇరు జట్ల మధ్య ఐదో వన్డే జరుగనుంది. భారత కాలమాన ప్రకారం ఉదయం గం.7.30 ని.లకు మ్యాచ్‌ ఆరంభం కానుంది.

మరిన్ని వార్తలు